యుద్ధం వస్తే, గ్యాస్ కొరతను అధిగమించండి ఇలా? టిప్స్ ఇవే!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. పలుమార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టలేదు. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఈ క్రమంలో యూఎస్, ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్ పై దాడులకు తెగబడే సూచనలు కలవు. దీంతో ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో ఆయిల్, గ్యాస్ సంక్షోభం మరలా తలెత్తే అవకాశం ఉంది. గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ధరలు ఆకాశానికి చేరుతాయి. ఇప్పటికే భారత్ యుద్ధం తాలూకు గడ్డు పరిస్థితులు చవిచూసింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ లభించక, వినియోగదారులు కిలోమీటర్ల మేర ఏజెన్సీల ముందు క్యూలైన్ల లో నిలబడ్డ దుర్భర పరిస్థితులు మనకు ఇటీవల అనుభవం అయ్యాయి. బ్లాక్ మార్కెట్ లో రెట్టింపు ధరలకు సిలిండర్లు కొన్న వినియోగదారుల జేబులు గుల్లయ్యాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ ని పొదుపు చేయడం ఆవశ్యకం. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా యాభై శాతానికి పైగా గ్యాస్ ఆదా చేయవచ్చు. అవేమిటో చూద్దాం..

వంట పాత్రలు ఎలా ఉండాలి?
వంట చేసే ముందు పాత్రలను నీటితో కడగడం పరిపాటి. దీంతో వంట పాత్రలు తడిగా ఉంటాయి. అలాగే పాత్ర అడుగున కొద్దిమేర నీరు నిల్వై ఉంటుంది. తడి పాత్రలను నేరుగా గ్యాస్ స్టౌవ్ పై పెడతారు. ఈ అలవాటు మార్చుకోవాలి. కారణం… తడి పాత్రలు వేడి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. సాధారణం కంటే అధిక గ్యాస్ ఖర్చు అవుతుంది. అందుకే వంట చేసే ముందు పాత్రలను ఒక పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి. పాత్రల మీద తడి, తేమ లేకుండా చూసుకోవాలి.
గ్యాస్ బర్నర్ పై దృష్టి పెట్టండి!
గ్యాస్ ఆదా విధానాల్లో గ్యాస్ బర్నన్ ని శుభ్రంగా ఉంచుకోవడం ఒకటి. గ్యాస్ బర్నర్ క్లీన్ గా లేని క్రమంలో సిలిండర్ పైప్ నుండి వెలువడే గ్యాస్ ప్రవాహంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. గ్యాస్ వెలువడే స్థాయిలో మంట ఉండదు. దాంతో గ్యాస్ వృధా అవుతుంది. తరచుగా గ్యాస్ బర్నర్స్ శుభ్రం చేయాలి. రంధ్రాల్లో మసి, దుమ్ము లేకుండా చూసుకోవాలి. గ్యాస్ పైపును సైతం రెండేళ్లకు ఒకసారి మారుస్తూ ఉండాలి.
వంటకు ఈ పాత్ర బెటర్!
వీలైనంత వరకు వంటకు ప్రెజర్ కుక్కర్ వాడటం ద్వారా గ్యాస్ ఆదా చేయవచ్చు. సాధారణంగా రైస్, పప్పు వంటి ఆహారపదార్దాలను ప్రిపేర్ చేసేందుకు మాత్రమే ప్రెజర్ కుక్కర్ వాడతారు. కానీ నాన్ వెజ్ వంటలతో పాటు అన్ని రకాల కూరలు ప్రెజర్ కుక్కర్ లో ఉడికించవచ్చు. ప్రెజర్ కుక్కర్ ఆవిరి బయటకు పోకుండా పట్టి ఉంచుతుంది. మిగతా పాత్రలతో పోల్చితే తక్కువ సమయంలో వంట రెడీ అవుతుంది. తద్వారా గ్యాస్ వినియోగం తగ్గుతుంది.
చల్లని వెజిటబుల్స్ ని ఇలా చేయాలి
ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన కూరగాయలను వెంటనే వంటకు ఉపయోగించడం సరికాదు. చల్లగా ఉన్న వెజిటబుల్స్ వేడి కావడానికి సమయం పడుతుంది. అందుకే వంట చేయడానికి కొంత సమయం ముందే కూరగాయలను బయట ఉంచాలి. అవి నార్మల్ టెంపరేచర్ కి వచ్చాక వంట చేస్తే గ్యాస్ సేవ్ అవుతుంది.
ఆహారంలో ఇవి కూడా చేర్చుకోండి
వంట చేసే సమయంలో పాత్రల మీద ప్లేట్ తప్పనిసరిగా ఉంచాలి. ఆవిరి బయటకు పోకుండా చేయడం ద్వారా తక్కువ సమయంలో వంట రెడీ అవుతుంది. అలాగే సిమ్ లో పెట్టి అధిక సమయం వంట చేయడం గ్యాస్ ఆదా మార్గాల్లో ఒకటి. సన్నని మంట మీద వండిన వంటలు రుచిగా కూడా ఉంటాయి. రోజూ తీసుకొనే ఆహారంలో పళ్ళు, సలాడ్లు జోడించాలి. ఇవి ప్రాసెస్డ్ ఫుడ్ కాకపోవడం వలన గ్యాస్ అవసరం ఉండదు.
ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టండి
వీలైనప్పుడు… అలాగే కొన్ని ప్రత్యేక వంటకాల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్లో వంట చేయడం మంచిది. వంటకు ఇండక్షన్ స్టవ్, మైక్రోవేవ్ వంటి సాధనాలు ఉపయోగించడం ద్వారా గ్యాస్ ఆదా చేయవచ్చు. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి గ్యాస్ వినియోగం తగ్గించండి. మీ సమయం, డబ్బు ఆదా చేసుకోండి..
