లైఫ్ లో సక్సెస్ కావాలని అందరూ కోరుకుంటారు. అయితే అది కొందరికే సాధ్యం. సమాజంలో ఫెయిల్యూర్ అయినోళ్లతో పోల్చితే అనుకున్నది సాధించి లక్ష్యం చేరుకున్నవారు కొందరే ఉంటారు. సక్సెస్ కావాలంటే కష్టపడాలి. అయితే కేవలం కష్టంతోనే విజయం దరిచేరదు. సరైన ఆలోచనా విధానం, సమయస్ఫూర్తి, తెలివైన నిర్ణయాలు,మనుషులతో-సమాజంతో వ్యవహరించే నేర్పు తెలిసి ఉండాలి. ముఖ్యంగా ప్రతికూల ఆలోచనలను అధిగమించాలి. వృత్తి లేదా వ్యాపారంలో రాణించడం, కుటుంబ సంబంధాలను మెరుగు పరచుకోవడం వంటి విషయాల్లో చాణక్య నీతి నేటికీ ఎంతో ఉపయోగపడుతుంది.
భారతదేశంలో పుట్టిన అపర మేధావి, ఆర్థిక, రాజకీయవేత్త చాణక్యుడు వేల సంవత్సరాల క్రితమే సక్సెస్ కి అవసరమయ్యే సూత్రాలు వెల్లడించారు. ఆయన రాసిన అర్థశాస్త్రం, చాణక్య
నీతి కాలాలకు అతీతంగా మేధస్సును అందిస్తున్నాయి. విజయానికి చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఏమిటో చూద్దాం..

ప్రతికూల ఆలోచనలను దూరం పెట్టండి
మనిషి విజయానికి అతి పెద్ద అడ్డంకి వారి ఆలోచనలే. ఏదైనా పని ఆరంభించే ముందు ఓటమి గురించి ఆలోచించకండి. ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం, గతంలో ఎదురైన వైఫల్యాలను గుర్తు చేసుకుంటూ బాధపడటం చేయకూడదు. దీని వలన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకు వేయాలని చాణక్య నీతి చెబుతుంది. సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆందోళన చెందడం కంటే పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి.
వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి
వ్యాపారానికి పెట్టుబడి కంటే ముఖ్యం తెలివి తేటలు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. అలాగే భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేయాలి. ముఖ్యంగా పోటీదారుల వ్యూహాలను అంచనా వేయగలగాలి. చాణక్య నీతి ప్రకారం ఏదైనా పని చేయబోయే ముందు దాని వలన కలిగే లాభనష్టాలు ముందుగానే బేరీజు వేసుకోవాలి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా వ్యాపారం విషయంలో అనాలోచిత నిర్ణయాలు సరికాదు. నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే వ్యాపారం చేయాలి. అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులను అంగీకరించాలి.
అందరినీ గుడ్డిగా నమ్మకండి
జీవితంలో నమ్మకం చాలా విలువైనది. అయితే ఎవరిని ఎంత వరకు నమ్మాలనే విషయంలో స్పష్టత అవసరం. పైకి మంచిగా కనిపించే అందరూ మనకు మేలు చేసేవారు కాకపోవచ్చని చాణక్య నీతి హెచ్చరిస్తుంది. కాబట్టి వ్యక్తుల మాటల కంటే వారి ప్రవర్తన ఆధారంగా అంచనా వేయాలి. అలాగే మన వ్యక్తిగత విషయాలు, బలహీనతలు, వ్యాపార రహస్యాలు అందరితో పంచుకోకూడదు. అలా అని ప్రతి ఒక్కరినీ అనుమానించాల్సిన అవసరం లేదు. అలా చేయడం వలన మనుషులు దూరమైపోతారు. వ్యక్తులలోని మంచి చెడులను అంచనా వేసి వారితో ప్రయాణం చేయాలి.
బంధాలను కాపాడుకోండి
కుటుంబం, సన్నిహితులు, స్నేహితులు, జీవిత భాగస్వామితో బంధాలు మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిన్నపాటి అపార్థాలు గొడవలుగా మారకుండా చూసుకోవాలి. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించడం, అవసరమైనప్పుడు క్షమాపణలు చెప్పడం, కోపంలో మాట్లాడకుండా ఉండటం మంచి బంధాలకు పునాది వేస్తాయి. ఇతరుల భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా స్వార్థం కోసం రిలేషన్స్ వాడుకోకూడదు అని చాణక్య నీతి సారాంశం.
సమయాన్ని వృధా చేయకండి
కోల్పోయిన డబ్బును తిరిగి సంపాదించవచ్చు. కానీ గడిచిన కాలం అసలు తిరిగిరాదు. అందుకే ప్రపంచంలో సమయం కంటే విలువైనది మరొకటి లేదు. సమయానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలని చాణక్య నీతి బోధిస్తుంది. ప్రతి పనికి ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. పనులు వాయిదా వేసే ధోరణి మానుకోవాలి. ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ మన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. కాలం, వయసును వృధా చేయకండని చాణక్య నీతి చెబుతుంది.
ఓటమిని విజయానికి మెట్టుగా భావించండి
ఓటమే విజయానికి పునాది అని గ్రహించండి. ఒకసారి ఓడిపోతే అందుకు గల కారణాలు విశ్లేషించాలి. ఒకసారి విఫలమైనంత మాత్రాన మనలో సామర్థ్యం లేనట్లు కాదు. ప్రతి ఓటమి ఓ కొత్త పాఠం నేర్పుతుంది. సహనం, క్రమశిక్షణ, పట్టుదలతో ప్రయత్నిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని చాణక్య నీతి స్ఫూర్తిని ఇస్తుంది.
చాణక్య నీతి పుస్తకాల్లో చదివే సూత్రాల సమాహారం మాత్రమే కాదు. వాటిలోని విలువైన ఆలోచనలను మన రోజువారీ జీవితంలో ఆచరిస్తే వ్యక్తిగత ఎదుగుదలతో పాటు వృత్తి జీవితంలోనూ మంచి ఫలితాలు సాధించవచ్చు. ప్రతికూల ఆలోచలనను అధిగమించవచ్చు. తెలివైన నిర్ణయాలు, మెరుగైన సంబంధాలు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం జీవితంలో కీలక పాత్ర వహిస్తాయి.
