ఆధునిక సంబంధాలు.. మారుతున్న భావోద్వేగాలు!

అనుబంధాలకు అర్థమే మారిపోయింది. కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాయి. అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి వంటి సంబంధాలు మసకబారుతున్నాయి. కుటుంబ సభ్యులలో ఒకరితో మరొకరికి సఖ్యత ఉండటం లేదు. ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్టు తయారైంది. పిల్లలను పేరెంట్స్ పట్టించుకోరు. పేరెంట్స్ ఏం చేస్తున్నారో? ఎలా ఉన్నారో? పిల్లలకు అవసరం లేదు. లోకం స్వేచ్ఛ, సంతోషం, స్వార్థంతో నిండిపోయింది.

ఉద్యోగాలు, ఆర్థిక ఒత్తిళ్లు, సోషల్ మీడియా ప్రభావం, వ్యక్తిగత లక్ష్యాలతో మనుషులు సతమతం అవుతున్నారు. ముఖ్యంగా కుటుంబానికి పునాది అయిన భార్య భర్తల బంధాలు సైతం విచ్ఛిన్నం అవుతున్నాయి. కుటుంబం మొత్తాన్ని నిర్వహించే ఆలుమగల మధ్య గొడవలు… అనర్థాలకు కారణం అవుతున్నాయి.  ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు సమయం కేటాయించడం కూడా కష్టం అవుతుంది. ఈ కారణంగా చిన్న చిన్న భావోద్వేగాలు, అపార్థాలు పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న జంటలు కాలక్రమేణా దూరం అవుతున్నారు. మరి ఆధునిక ప్రపంచంలో మారుతున్న భావోద్వేగాలను ఎలా అర్థం చేసుకోవాలి? వైవాహిన బంధాన్ని ఎలా ఆనందంగా గడపాలి? అనేది ఈ కథనంలో చూద్దాం…

భావోద్వేగాల్లో మార్పులను గుర్తించాలి

ప్రతి మనిషి భావోద్వేగాలు కాలానుగుణంగా మారుతుంటాయి. ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత సమస్యలు మనిషి ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. గతంలో ఎక్కువగా మాట్లాడే భాగస్వామి ఇప్పుడు మౌనంగా ఉంటున్నా, చిన్న విషయాలకే చిరాకు పడుతున్నా దాని వెనుక కారణాన్ని తెలుసుకోవాలి. వెంటనే తప్పుపట్టకుండా వారి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సమస్య మొదటి దశలో ఉన్నప్పుడే పరిష్కారం చూపితే బంధాలు గట్టిగా ఉంటాయి. ఒకరి మధ్య మరొకరికి అన్యోన్యత పెరుగుతుంది.

మనసు విప్పి మాట్లాడుకోవాలి

వైవాహిక బంధంలో సంభాషణ చాలా ముఖ్యం. మనసులో ఉన్న బాధలు, ఇష్టాలు, అసంతృప్తులు, భయాలను భాగస్వామితో పంచుకోవాలి. మాట్లాడకుండా సమస్యలను మనసులోనే దాచుకోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. రోజులో కనీసం కొంత సమయమైనా మొబైల్ ఫోన్లను పక్కనపెట్టి ఇద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు శ్రద్ధగా వినడం కూడా అంతే ముఖ్యం. భాగస్వామి ఒక విషయం చెబుతున్నప్పుడు దృష్టి పెట్టకపోతే, వేదనకు గురవుతారు. క్రమేణా వాళ్ళ మనసులోని భావాలు, సమస్యలు, సంతోషాలు మీతో పంచుకోవడం మానేస్తారు.

ఉద్యోగం, కుటుంబం మధ్య సమతుల్యత

ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం సాధారణమైంది. దీంతో ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, ఉద్యోగ విధులు అన్నీ కలిపి ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇంటి బాధ్యతలను ఒకరిపైనే వేయకుండా ఇద్దరూ పంచుకోవాలి. ఒకరి కష్టాన్ని మరొకరు గుర్తించి సహకరించాలి. పరస్పర సహకారం ఉంటే కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పర్సనల్-ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేయడం చాలా కీలకం. ఉద్యోగ బాధ్యతలు, డబ్బు సంపాదన మాత్రమే ముఖ్యం అనుకుంటే పొరపాటే. కేవలం ఆర్థిక అవసరాలు తీర్చితే చాలు అనుకుంటే అపోహ. కుటుంబ బాధ్యతలు తీసుకోవడం, భాగస్వామితో సమయం గడపడం కీలకం.

సోషల్ మీడియాకు పరిమితులు విధించాలి

సోషల్ మీడియా ఆధునిక సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. ఇతర జంటల జీవితాలతో తమ జీవితాలను పోల్చుకోవడం, ఫోన్‌కే ఎక్కువ సమయం కేటాయించడం వల్ల భాగస్వామి నిర్లక్ష్యానికి గురైనట్లు భావించవచ్చు. అందుకే కలిసి ఉన్నప్పుడు ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి. సోషల్ మీడియాలో కనిపించే జీవితమే నిజమైన జీవితం కాదని గుర్తించాలి. సోషల్ మీడియా పోస్ట్స్ కి ప్రభావితం కాకూడదు.

చిన్న చిన్న ఆనందాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

బంధం బలంగా ఉండటానికి ఖరీదైన బహుమతులు, విదేశీ పర్యటనలు అవసరం లేదు. చిన్న ప్రశంస, ఇష్టమైన ఆహారం తయారుచేయడం, కలిసి నడవడం, అప్పుడప్పుడు బయటకు వెళ్లడం వంటి చిన్న పనులు కూడా ప్రేమను పెంచుతాయి. ప్రత్యేక సందర్భాల కోసం ఎదురు చూడకుండా ప్రతిరోజూ ఒకరికొకరు ఆనందాన్ని పంచుకోవాలి.

గొడవలను పరిష్కరించుకునే విధానం ముఖ్యం

ప్రతి దాంపత్య జీవితంలో అభిప్రాయ భేదాలు సహజం. అయితే కోపంలో మాట్లాడే మాటలు బంధాన్ని దెబ్బతీయవచ్చు. గొడవ జరిగినప్పుడు ఒకరినొకరు అవమానించకుండా, పాత విషయాలను తిరిగి ప్రస్తావించకుండా సమస్యకు పరిష్కారం వెతకాలి. అవసరమైతే కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి.

వ్యక్తిగత స్వేచ్ఛకు గౌరవం ఇవ్వాలి

భార్యాభర్తలు ఒకరికొకరు ఎంత దగ్గరగా ఉన్నా వ్యక్తిగత అభిరుచులు, స్నేహాలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని గౌరవించాలి. భాగస్వామికి వ్యక్తిగత సమయం ఇవ్వడం వల్ల బంధం బలహీనపడదు. ఒకరి ఎదుగుదలకు మరొకరు ప్రోత్సాహం అందించాలి.

ఆధునిక జీవితంలో వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు. పరస్పర అవగాహన, నమ్మకం, గౌరవం, సమయపాలన, భావోద్వేగ పరిపక్వత కూడా అవసరం. సమస్యలు వచ్చినప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేయకుండా కలిసి పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా భాగస్వామిని జీవిత ప్రయాణంలో ఒక తోడుగా భావించి, వారి భావాలకు విలువ ఇచ్చినప్పుడే దాంపత్య జీవితం ఆనందంగా, అన్యోన్యంగా సాగుతుంది.

Leave a Comment