అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కాంతివంతమైన మెరిసే చర్మం కోసం వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మార్కెట్ లో దొరికే ప్రతి బ్యూటీ ప్రొడక్ట్స్ ని ట్రై చేస్తారు. వేలకు వేలు ఖర్చు చేస్తారు. అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రమే. ఆకర్షించే వ్యాపార ప్రకటనలు చూసి మోసపోతూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలు చర్మ సౌందర్యానికి దోహదం చేస్తాయి. మెరుగైన ఫలితాలు అందిస్తాయి.
ప్రతిరోజూ ఉదయం మెరిసే ఆరోగ్యకర చర్మం మీ సొంతం కావాలంటే… రాత్రి పడుకునే ముందు సరైన చర్మ సంరక్షణ చాలా అవసరం. బయటి కాలుష్యం, దమ్ము, ధూళి కారణంగా, రోజంతా బయట తిరిగిన మీ చర్మం ఒత్తిడికి లోనవుతుంది. ఈ క్రమంలో రాత్రివేళ మీరు నిద్రపోయే సమయంలో చర్మం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. కాబట్టి నైట్ స్కిన్ కేర్ చాలా ముఖ్యం. రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన సులభమైన బ్యూటీ టిప్స్ ఈ కథనంలో చూద్దాం…

మేకప్ పూర్తిగా తొలగించండి
మేకప్ వేసుకోవడం అమ్మాయిలకు చాలా కామన్ అయిపోయింది. ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే కాకుండా… ఆఫీస్, కాలేజెస్ కి కూడా మేకప్ తో వెళుతున్నారు. మేకప్ వేసుకున్నప్పటికీ దాని నిర్వహణ కూడా తెలిసి ఉండాలి. రాత్రివేళ మేకప్ తొలగించకుండా పడుకోవడం సరికాదు. అలా చేస్తే మేకప్ మీ చర్మానికి హాని చేస్తుంది. మేకప్ కి దుమ్ము, ధూళి అంటుకుంటుంది. అలాగే మేకప్ చర్మం రంధ్రాలను మూసివేస్తుంది. దాంతో మొటిమలు, బ్లాక్ హెడ్స్ సమస్యలు తలెత్తుతాయి. చర్మం త్వరగా ముడతలు పడే అవకాశం ఉంది. పడుకునే ముందు ఆయిల్ బేస్డ్క్లెన్సర్ లేదా మేకప్ రిమూవల్ తో మేకప్ ని పూర్తిగా తొలగించాలి. అనంతరం మైల్డ్ ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
డబుల్ క్లెన్సింగ్ పద్ధతి
సాధారణ ఫేస్ వాష్ తో కేవలం పైపైన ఉండే ధూళి, దుమ్ము మాత్రమే పోతుంది. చర్మం లోపలి వరకు శుభ్రం కావాలంటే డబుల్ క్లెన్సింగ్ పద్ధతి ఉత్తమం. మొదట మైసెలార్ వాటర్ లేదా క్లెన్సింగ్ బామ్ తో ముఖాన్ని తుడిచి, ఆ తర్వాత మీ చర్మ తత్వానికి సరిపోయే రెగ్యులర్ ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవాలి. దీని వలన చర్మం శుభ్రపడి తాజాగా ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. రోజూ రాత్రి ఈ పద్ధతి అనుసరిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
టోనర్ అండ్ సీరమ్ వాడకం
రాత్రివేళ పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఆల్కహాల్ లేని టోనర్ ను కాటన్ బాల్ సహాయంతో ముఖానికి రాయాలి. ఇలా చేయడం వలన చర్మం పీహెచ్ లెవల్స్ సమతుల్యంగా ఉంటాయి. అలాగే చర్మం రంద్రాలు బిగుతుగా ఉండేందుకు సహకరిస్తుంది. అనంతరం యాంటీఆక్సిడెంట్స్ లేదా విటమిన్ సీ, హైల్యూరోనిక్ యాసిడ్ ఉంటే సీరమ్ ను కొన్ని చుక్కలు ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మానికి కావలసిన పోషణ అందిస్తుంది. రాత్రిపూట అనుసరించాల్సిన సౌందర్య చిట్కాల్లో ఇది ఒకటి.
మాయిశ్చరైజర్ లేదా నైట్ క్రీమ్
రాత్రిపడుకునే ముందు మాయిశ్చరైజర్ రాయడం అసలు మర్చిపోకూడదు. ముఖం కడుక్కున్న తర్వాత చర్మంలోని తేమ కోల్పోతుంది. మంచి నైట్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ రాయడం వలన చర్మం రోజంతా తేమగా, మృదువుగా ఉంటుంది. ఇది చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. ముడతలను నివారిస్తుంది. డ్రై స్కిన్ తో బాధపడేవారికి ఈ చిట్కా ప్రయోజనకరం. మంచి ఫలితాలు ఇస్తుంది.
కంటికి కింది భాగం & పెదాల సంరక్షణ
ముఖంలో కంటి కింది చర్మం, పెదాలు మరింత సున్నితంగా ఉంటాయి. కాబట్టి వీటి సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరం. కంటి క్రింద నల్లటి వలయాలు ఏర్పడకుండా, పెదాలు నల్లగా మారకుండా, పగల కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి కింద నల్లటి వలయాలను నివారించేందుకు అండర్ ఐ క్రీమ్ రాసుకోవడం మంచిది. అలాగే పెదాలు పగలకుండా రాత్రి పడుకునే ముందు లిప్ బామ్ లేదా స్వచ్ఛమైన నెయ్యి రాసుకుంటే ఉదయం కల్లా పెదాలు మృదువుగా మారతాయి. ముఖంలో స్పష్టంగా కనిపించే పెదాలను అందంగా ఉంచుకోవడం చాలా కీలకం.
ముఖ్య సౌందర్యానికి ఉపయోగపడే ఆహారం
ఈ చిట్కాతో పాటు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చర్మం మరింత అందంగా మారుతుంది.
నీరు ఎక్కువగా తాగండి. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగండి. అలాగే కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ తాగడం వలన చర్మం కాంతివంతం అవుతుంది. తేమగా మారుతుంది.
తాజా పండ్లు తినండి. సిట్రస్ ఫ్రూట్స్ నిమ్మకాయ, బత్తాయి, నారింజ తరచుగా తినండి. మామిడి, బొప్పాయి, దానిమ్మ, బెర్రీస్ రక్త ప్రసరణ పెంచి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.
తాజా ఆకుకూరలు, కూరగాలు తినడం చర్మ సౌందర్యానికి అవసరం. కేరట్, బీట్ రూట్, పాలకూర, ఇతర ఆకుకూరలు, టమోటా వంటి వెజిటబుల్స్ మీ అందాన్ని పెంచుతాయి.
డ్రై ఫ్రూట్స్ సైతం చర్మ సౌందర్యానికి అవసరం. బాదం, అక్రోటులో ఉండే విటమిన్-ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్… చర్మం పొడిబారడాన్ని నివారిస్తాయి.
