ఆహారాన్ని ఒకవైపే నమిలితే ఇంత ప్రమాదమా?

ఆహారాన్ని నమిలి తినడం చాలా అవసరం. ఆహారాన్ని నెమ్మదిగా తినాలి. అలాగే మెత్తగా నమిలి మింగాలి. అప్పుడు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే ఆహారాన్ని ఎలా నములుతున్నాం అనేది కూడా కీలకమే. చాలా మంది అనాలోచితంగా చేసే ఒక అలవాటు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నోటిలో కుడి వైపు లేదా ఎడమ వైపు మాత్రమే నమిలి తినడం చేస్తారు. ఇలా ఒకవైపు దంతాలతోనే నమలడానికి పలు కారణాలు ఉన్నాయి. కొందరికి ఏదో ఒకవైపు పిప్పి పళ్ళు, బలహీనమైన దంతాలు ఉండొచ్చు. ఈ కారణంగా దంతాలు బలంగా ఉన్న వైపు మాత్రమే నములుతారు.

అలాగే చిన్నతనం నుండి కొందరికి అలవాటుగా ఉంటుంది. ఒకవైపు మాత్రమే ఆహారం నమిలి తినడం స్వల్పకాలంలో  హానీ చేయకపోవచ్చు. కానీ సుదీర్ఘకాలం ఈ అలవాటు కొనసాగితే సమస్యలు తప్పవని వైద్యులు సూచిస్తున్నారు. ఈ అలవాటు దంతాలు, దవడలు, ముఖ నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు మాత్రమే నమిలి తినడం వలన తలెత్తే సమస్యలు ఏమిటో ఈ కథనంలో చూద్దాం.

దవడ కీలుపై ఒత్తిడి 

మనం నోటిని తెరవడానికి, మూయడానికి కింది దవడ ఎముకను పుర్రెకు కలిపేందుకు ఒక కీలు ఉంటుంది. దీన్ని టెంపోరోమండిబులర్ జాయింట్(TMJ) అంటారు. ఆహారం నమలడంలో కూడా దవడ కీలు కీలక పాత్ర పోషిస్తుంది. మనం నిరంతరం ఒకవైపే ఆహారం నమిలి తినడం వలన, ఆ వైపు ఉన్న దవడ కీలుపై అధిక భారం పడుతుంది. దవడ ఎడమ కీలునో లేదో కుడి కీలునో అధికంగా పని చేయించినట్లు అవుతుంది.

ఒకవైపు కీలు మీదే భారం పడడం వలన అరిగిపోవచ్చు. ఇది దవడలో తీవ్రమైన నొప్పికి దారి తీసే అవకాశం ఉంది. నోరు తెరిచేటప్పుడు, మూసేటప్పుడు శబ్దం రావచ్చు. అలాగే దవడ పట్టేయడం వంటి సమస్యలు సైతం తలెత్తవచ్చు. ఒకవైపు మాత్రమే నమిలి తినడం వలన ఎదురయ్యే సమస్యల్లో ఇది ఒకటి.

ఒకవైపు దంతాలు అరిగిపోవడం 

మీరు సుదీర్ఘకాలం ఒకవైపు మాత్రమే నమిలి తినడం వలన… ఆ వైపు ఉన్న పళ్ళు త్వరగా అరుగుదలకు లోనవుతాయి. పళ్ళకు రక్షణగా ఉండే ఎనామెల్ పొర క్షీణిస్తుంది. ఎనామెల్ పొర కోల్పోతే ఆహారం తినడంలో సమస్యలు మొదలవుతాయి. ఒకవైపు దంతాలు సున్నితంగా మారతాయి. బాగా వేడిగా, చల్లగా ఉన్న పదార్థాలు దంతాలకు తగిలితే పళ్ళు జివ్వు మంటాయి. టూత్ సేన్సిటివిటి పెరుగుతుంది.

అదే సమయంలో మరోవైపు దవడ దంతాలను అసలు ఉపయోగించకపోవడం వలన అవి బలహీనంగా మారతాయి. వాడకపోయినప్పటికీ ఆ పళ్ళు పాడవుతాయి. మొత్తంగా ఆహారం నమలడానికి కీలకమైన దంత వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది.

ముఖం రూపంలో మార్పులు, అసమానతలు 

శరీరంలో ఏ కండరాలనైతే ఉపయోగిస్తామో అవి బలంగా మారతాయి. వాడని కండరాలు బలహీనంగా మారతాయి. ఇది దవడ కండరాలకు కూడా వర్తిస్తుంది. నమలడం ముఖానికి ఒక వ్యాయామం వంటిది. ఒకవైపే నమలడం వలన ఆ వైపు ఉన్న దవడ కండరాలు బాగా పెరుగుతాయి. లావుగా మారతాయి. వాడని వైపు దవడ కండరాలు సన్నబడి లేదా బలహీనంగా మారతాయి. ఈ కారణంగా ఒకవైపు ముఖం సాగినట్లు లేదా అసమానంగా కనిపిస్తుంది. ఇది ముఖంలో అసమానతలకు కారణమవుతుంది. ముఖ సౌందర్యం కోల్పోయే అందవిహీనంగా మారే ప్రమాదం ఉంది.

చిగుళ్ల సమస్యలు-ప్లాక్ పేరుకుపోవడం 

ఆహారం నమలడం అనేది సహజంగా దంతాలను క్లీన్ చేసే ప్రక్రియ. మనం తినే రకరకాల ఆహారాలు దంతాలను, చిగుళ్ళను, నోటిని శుభ్రం చేస్తాయి. ఆహారాన్ని నమిలేటప్పుడు ఎక్కువ మొత్తంలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది వ్యర్థాలను శుభ్రం చేస్తుంది. మీరు ఒకవైపు మాత్రమే ఆహారం నమిలితే… ఆహారం నమలని దవడ వైపు లాలాజలం తక్కువ ఉత్పత్తి అవుతుంది. ఆహార కదలికలు తక్కువగా ఉండటం వలన పళ్ళ మీద నాచు(ప్లాక్), రాతిరాయి(టార్టర్) వేగంగా పేరుకుపోతాయి.

ఒకవైపు నమిలే అలవాటు కారణంగా నోరు శుభ్రం కాదు. పేరుకుపోయిన ప్లాక్, టార్టర్ కారణంగా నోటి దుర్వాసన, చిగుళ్ళవాపు, చిగుళ్ల వ్యాధులు సోకుతాయి. ఈ సమస్యలు ఆహారం తినడంలో అవరోధాలు కలిగిస్తాయి.

జీర్ణక్రియపై ప్రభావం

ఆహారాన్ని ఒకవైపే నమలడం వలన పూర్తి స్థాయిలో ఆహారం నలగదు. ఆహారం సరిగ్గా నలగకుండానే మింగడం వలన జీర్ణాశయంలో అదనపు భారం పడుతుంది. దీని వలన గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.

పరిష్కార మార్గాలు 

ముందుగా కారణాలు గుర్తించాలి. నోటిలో ఒకవైపు పిప్పి పన్ను, పన్ను నొప్పి లేదా పన్ను ఊడిపోవడం వలన ఈ సమస్య తలెత్తిందమో తెలుసుకోండి.
దంతాల సమస్య ఉంటే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించండి. మీ దంత సమస్యకు అనువైన వైద్యం తీసుకోండి. పళ్ళ సమస్యలు తీరితే ఆహారం పూర్తి స్థాయిలో నమలడానికి సాధ్యం అవుతుంది.

ఒకవేళ చిన్నప్పటి నుండి కొనసాగుతున్న అలవాటు అయితే… బయటపడేందుకు ప్రయత్నం చేయండి. స్పృహతో నమలండి. తింటున్నప్పుడు రెండువైపులా సమానంగా నమలండి. దీన్ని అలవాటుగా మార్చుకోండి.

Leave a Comment