మిల్లెట్స్ లేక రైస్ ఏవి తింటే మంచిది?

సౌత్ ఇండియన్స్ రైస్ ని ఆహారంగా తీసుకుంటారు. నార్త్ ఇండియన్స్ తో పోల్చుకుంటే మనం బియ్యం పైనే ఎక్కువ ఆధారపడుతున్నాం. ఈ మధ్య కాలంలో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 25 కేజీల బియ్యం ప్యాకెట్ పై రూ.500 నుండి రూ.800 వరకు ధరలు పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. బియ్యానికి బదులుగా వినియోగించే ఆహార పదార్థాలు గురించి ఆలోచన చేస్తున్నారు.

కాగా ఓ నాలుగైదు శతాబ్దాలు వెనక్కి పోతే సౌత్ ఇండియన్స్ తృణ ధాన్యాలను(మిల్లెట్స్) ఆహారంగా తీసుకునేవారు. బియ్యంతో పోల్చితే రాగులు, జొన్నలు తక్కువ ధరకు లభించేవి. బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉన్న రోజుల్లో స్వయంగా పండించుకున్న రాగులు, జొన్నలను ఆహారంగా తీసుకునేవారు. రాగి సంగటి, జొన్న రొట్టెలు వారి ఆహారంలో ప్రధాన భాగంగా ఉండేవి. క్రమేణా జీవన ప్రమాణాలు మెరుగు పడటంతో పాటు, బియ్యం లభ్యత పెరిగిన నేపథ్యంలో ప్రజలు అన్నానికి అలవాటు పడ్డారు. తాజాగా బియ్యం ధరలు పెరిగాయి. అదే సమయంలో జనాల్లో కొన్నాళ్లుగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. బియ్యం నుండి పలువురు మిల్లెట్స్ కి మారుతున్నారు. ఈక్రమంలో బియ్యం-మిల్లెట్స్ లో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఏ ఆహారంతో ఎలాంటి ప్రయోజనాలు ఒనగూరుతాయో ఈ స్టోరీలో చూద్దాం..

బియ్యం VS తృణ ధాన్యాలు-పోషకాల వ్యత్యాసం 

మనం రోజూ తినే పాలిష్ చేసిన తెల్లబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే పీచు పదార్థం, పోషకాలు తక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే బియ్యం త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచేస్తుంది.

గ్లైసెమిక్ ఇండెక్స్(GI): పాలిష్ పట్టించిన తెల్ల బియ్యానికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ రాగులు, జొన్నల్లో గ్లైసెమిక్ శాతం తక్కువగా ఉంటుంది.

పీచు పదార్థం: మిల్లెట్స్ లో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఈ కారణంగా జీర్ణక్రియ నెమ్మదిగా సాగి, ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కొనసాగుతుంది. అన్నంలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అందుకే త్వరగా ఆకలి అవుతుంది. ఆకలి కారణంగా చిరుతిండ్లు తినడం వలన బరువు పెరిగే అవకాశం ఉంది.

రాగులు

రాగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. క్యాల్షియం, ఐరన్ అధికంగా కలిగిన సూపర్ ఫుడ్. ఇతర ఈ

ధాన్యాల్లో లేనంత క్యాల్షియం రాగులలో ఉంటుంది. పిల్లల పెరుగుదలకు, వృద్దులలో ఎముకల బలహీనతను నివారించడానికి రాగి జావ లేదా సంగటి చాలా శ్రేష్టమైనవి.

రక్తహీనత నివారణకు రాగులు దోహదం చేస్తాయి. రాగులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అనీమియా సమస్యతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది.

తక్కువ కొవ్వు: బరువు తగ్గాలనుకునేవారికి, ఊబకాయంతో బాధపడేవారికి రాగులు గొప్ప ఎంపిక. రాగుల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో 1.3 నుండి 1.9 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది. కాబట్టి రాగులు ప్రధాన ఆహారంగా తీసుకునేవారు బరువు పెరగడం దాదాపు అసాధ్యం.

జొన్నలు

ప్రాచీనకాలంలో బియ్యానికి బదులు ప్రజలు జొన్న రొట్టెలు తినేవారు. జొన్నలు ఆహారంగా తీసుకోవడం మంచి అలవాటు.

గ్లూటెన్ ఫ్రీ: జొన్నలు పూర్తిగా గ్లూటెన్ రహిత ధాన్యం. గ్లూటెన్ పడనివారు, జీర్ణ సమస్యలతో బాధపడేవారికి జొన్నలు ఉత్తమ ఆహారం.

గుండెకు రక్షణ: జొన్నలలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, మెగ్నీషియం, ఫైబర్… చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్: జొన్నలు నిరంతరం శక్తిని విడుదల చేస్తాయి. ఈ కారణంగా మధుమేహగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. షుగర్ వ్యాధితో బాధపడేవారు జొన్నలు తమ ఆహారంలో చేర్చుకోవాలి.

మిల్లెట్స్ ని ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?

బియ్యం కంటే రాగులు, జొన్నలు వంటి ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ఉత్తమం అని ఆరోగ్య ప్రయోజనాలు పోల్చి చూస్తే  తెలుస్తుంది.అయితే బియ్యాన్ని ఒక్కసారిగా మానేయాల్సిన అవసరం లేదు. క్రమంగా మోతాదు తగ్గిస్తూ… మిల్లెట్స్ వినియోగం పెంచండి.

ఉదయాన్నే అల్పాహారంలో సాధారణ ఇడ్లీ, దోసకు బదులు… రాగి ఇడ్లీ, రాగి జావ, రాగి దోస తినండి. ఇవి రుచిగా కూడా ఉంటాయి.

మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో తెల్ల బియ్యం అన్నంకి బదులుగా జొన్న రొట్టెలు లేదా జొన్న అన్నం తినవచ్చు.

సాయంత్రం వేళల్లో రాగి లేదా జొన్న పిండితో చేసిన ఉప్మా లేదా స్నాక్స్ ఆహారంగా తీసుకోండి.

ఆధునిక జీవన శైలి వలన అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ వ్యాధుల నుండి ఉపశమనం పొందాలి అంటే ఆహార విధానాలు మార్చుకోవడం తప్పనిసరి. మన పూర్వికులు అనుసరించిన తృణ ధాన్యాల ఆహార పద్దతులకు మారడం ఎంతో మంచిది. తెల్ల బియ్యం అందించే తక్షణ శక్తి కంటే.. రాగులు, జొన్నలు అందించే దీర్ఘకాలిక ప్రయోజనాలు విలువైనవి. ఈ మార్పు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి గట్టి పునాది వేస్తుంది.

Leave a Comment