ప్రేమకు సరికొత్త నిర్వచనం చెబుతున్నారు నేటి యువత. వారు ఎంచుకుంటున్న ప్రేమ వేదికలు సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఉంటున్నాయి. స్కూల్స్, కాలేజీలు, బస్ స్టాప్ ప్రేమలు పాతబడిపోయాయి. ఇక డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయాలు, ప్రేమ వ్యవహారాలు సైతం అవుట్ డేటెడ్ అంటున్నారు. యువతలో ప్రొటెస్ట్ డేటింగ్ లేటెస్ట్ ట్రెండ్. ముఖ్యంగా జెన్ జీ బ్యాచ్ లో ఈ ప్రొటెస్ట్ డేటింగ్ ప్రాచుర్యం పొందుతోంది.
జెన్ జీ బ్యాచ్ కేవలం అందమే ప్రేమకు ప్రమాణంగా చూడటం లేదు. ఒకరి ఆలోచనా విధానం, ఆశయాలు, లక్ష్యాలు, సామాజిక దృక్పథం ఆధారంగా పార్టనర్ ని ఎంచుకుంటున్నారు. సామాజిక ఉద్యమాలు వేదికలుగా ప్రేమలు చిగురిస్తున్నాయి. నిరసనలు, ర్యాలీలలో కలిసిన యువతీ యువకులు మనసును ఇచ్చి పుచ్చుకుంటున్నారు. డేటింగ్ ప్రపోజల్స్ పెడుతున్నారు. అసలు ఈ ప్రొటెస్ట్ డేటింగ్ అంటే ఏమిటీ? దాని అసలు ఉద్దేశం ఏమిటీ? యువత ఎలా ఆకర్షితులు అవుతున్నారో ఈ కథనంలో చూద్దాం…

ప్రొటెస్ట్ డేటింగ్ అంటే ఏమిటీ?
సోషల్ మీడియా ఒకే ఆలోచనలు ఉన్న పలువురిని ఏకం చేస్తుంది. జెన్ జీ బ్యాచ్ లో సామాజిక చైతన్యం కూడా ఎక్కువే. రాజకీయ, సామాజిక, పర్యావరణ అంశాల మీద యువత స్పందిస్తున్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. నిరసనలు, ర్యాలీలలో యువతీ యువకులు పాల్గొంటున్నారు. అమ్మాయిలు సైతం మాకు ఎందుకులే అనే ధోరణి వదిలేసి, తమ గళం వినిపిస్తున్నారు.
వివిధ ప్రాంతాలకు, భాషలకు చెందిన యువతీ యువకులు ర్యాలీలతో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఆలోచనలు, లక్ష్యాలు షేర్ చేసుకుంటున్నారు. తమ ఆలోచనలకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు ఆకర్షితులు అవుతున్నారు. అందం, హోదా కాకుండా కేవలం వ్యక్తిత్వం ఆధారంగా డేటింగ్ పార్టనర్ ని ఎంచుకుంటున్నారు. ఒక అంశం మీద స్పందించే తీరు, బాధ్యత వారిని దగ్గర చేస్తున్నాయి. దీన్నే ప్రొటెస్ట్ డేటింగ్ అంటున్నారు.
ఒకే ఆలోచనా విధానం-దృఢమైన బంధం
ప్రొటెస్ట్ డేటింగ్ లో భావసారూప్యత కీలక పాత్ర పోషిస్తుంది. సమాజం పట్ల ఒకే విధమైన ఆలోచనలు ఉన్న ఇద్దరు వ్యక్తులు నిరసన కార్యక్రమాల్లో కలిసినప్పుడు అది ప్రొటెస్ట్ డేటింగ్ కి దారితీస్తుంది.
స్పష్టమైన అవగాహన: వారిది కేవలం ఒకరోజు పరిచయం మాత్రమే. కొన్ని గంటలు సాగే ప్రయాణం. అయినప్పటికీ బలమైన బంధానికి పునాది పడుతుంది. దానికి కారణం ఆలోచనా సరళి, విలువలు, ప్రవర్తన. సామాజిక విషయాల పట్ల ఒకరి వైఖరి ఏమిటో స్పష్టంగా అర్థం అవుతుంది. భావసారూప్యత యువతను దగ్గర చేస్తుంది.
సహజత్వం: ప్రొటెస్ట్ డేటింగ్ కి పురిగొల్పుతున్న మరొక అంశం సహజత్వం. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్, డేటింగ్ యాప్స్ సహజత్వానికి దూరంగా ఉంటాయి. అలాగే అవతలి వ్యక్తి రియాలిటీ తెలియదు. ఆకర్షించేందుకు అబద్ధాలు చెప్పే వ్యక్తులు ఉంటారు. నిరసనల్లో అందుకు అవకాశం లేదు. అలాగే ఉద్యమాల్లో పాల్గొన్న యువత తమ సహజ భావోద్వేగాలు బయటపెడతారు. ఇక్కడ అసహజత్వానికి చోటు లేదు.
డిజిటల్ డేటింగ్ కి ప్రత్యామ్నాయం
డేటింగ్ యాప్స్ ట్రెండ్ కూడా ముగిసినట్లే అనే భావన మొదలైంది. మొన్నటి వరకు డేటింగ్ యాప్స్ కి అడిక్ట్ అయిన యువత మెల్లగా దూరం అవుతున్నారు. డిజిటల్ డేటింగ్, స్వైపింగ్ కల్చర్ తమకు విసుగుపుట్టిస్తోందని యువత అభిప్రాయపడుతున్నారు. ర్యాలీలో వ్యక్తీకరించే ఉద్వేగాలు, సామాజిక స్పృహ… తక్కువ సమయంలో బలమైన బంధానికి నాంది పలుకుతున్నాయి. అందుకే జెన్ జీ బ్యాచ్ డిజిటల్ డేటింగ్ కి ప్రొటెస్ట్ డేటింగ్ ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు.
ముసుగు లేని వ్యక్తిత్వం
సహజంగా డేటింగ్ లో యువతీ యువకుల ప్రవర్తన అసహజంగా ఉంటుంది. ఇంప్రెస్ చేయడానికి తమ అసలు వ్యక్తిత్వాన్ని దాచేస్తారు. చెప్పాలంటే ముసుగు వెనకున్న ఆ వ్యక్తి అసలు తత్త్వం ఏమిటో బోధపడదు. కచ్చితంగా అంచనా వేయలేం. నిరసనలు, ర్యాలీలలో ఈ తరహా ప్రవర్తన ఉండదు. ఉద్యమాల్లో పాల్గొనేవారు ఆ అంశానికి ఎమోషనల్ గా బలంగా కనెక్ట్ అవుతారు. ఇక్కడ తమ వ్యక్తిత్వంతో ఒకరిని ఇంప్రెస్ చేయాలనే ఆలోచన ఉండదు. సహజంగా తమ గొంతు వినిపిస్తారు. ప్రవర్తిస్తారు. ముసుగు లేని నిజమైన ప్రవర్తన, ఆలోచనా విధానం ప్రొటెస్ట్ డేటింగ్ కి ప్రోత్సహిస్తుంది.
ఉద్యమమే అసలు లక్ష్యం
ప్రొటెస్ట్ డేటింగ్ లో పరిగణలోకి తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఇక్కడ డేటింగ్ అనేది ప్రాధాన్యత కాకూడదు. ఉద్యమ లక్ష్యమే ప్రధమ అంశంగా ఉండాలి. ఆ ర్యాలీ ఉద్దేశం, ఆశయం, పవిత్రత చెడకుండా చూసుకోవాలి. పరిచయం ఏర్పడిన అనంతరం ఆ వ్యక్తి ఆలోచన విధానం, సామాజిక స్పృహ, భావనలు నచ్చితే ప్రొటెస్ట్ డేటింగ్ కి ముందడుగు వేయాలి.
కేవలం డేటింగ్ కి వేదికగా నిరసనలు, ర్యాలీలను మార్చుకోవడం ప్రొటెస్ట్ డేటింగ్ లక్షణం కాదు. పరిచయంతో పాటు ఏర్పడే బంధం సహజంగా ఉండాలి.
ఇక ప్రొటెస్ట్ డేటింగ్ ప్రేమకు కొత్త అర్థం చెబుతుంది. ప్రేమ అనేది పార్క్ లలో, కేఫేలలో లేదా నాలుగు గోడల మధ్య కలిగే భావన కాదని నిరూపిస్తుంది. భాగస్వామిని ఎంచుకోవడానికి యువత అనుసరిస్తున్న ఈ విధానం గొప్పదే అని చెప్పాలి. కారణం ఇక్కడ స్వచ్ఛమైన ప్రేమకు ఆస్కారం ఉంది. అందం, ఆకర్షణ, ప్రలోభాలు, ప్రయోజనాల ఆధారంగా పుట్టేది ప్రొటెస్ట్ డేటింగ్ కాదు. ఇప్పుడే మొదలైన ఈ ట్రెండ్ భవిష్యత్ లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
