మనిషి శరీరంలో జీర్ణ వ్యవస్థను రెండవ మెదడుగా అభివర్ణిస్తారు. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, దాన్ని శక్తిగా మార్చేందుకు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. గట్ హెల్త్ మానసిక ప్రశాంతత చేకూర్చడంలో కూడా కీలకం. జీర్ణ సమస్యలు ఉన్నవారు రోజంతా నీరసంగా, అసహనంగా, చికాకుగా ఉంటారు. కాగా భారతదేశంలో గట్ హెల్త్ రేట్ గణనీయంగా పడిపోయింది. వయసుతో సంబంధం లేకుండా కోట్ల మంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ప్రముఖ సంస్థల గణాంకాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి.
జీర్ణ సమస్యల తీవ్రత
ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్(IDA)తో పాటు పలు సంస్థల సర్వేలు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాయి. మన దేశంలో ప్రతి 10 మందిలో 7గురు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అంటే 70% ఇండియన్స్ జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదికల సారాంశం.
59% ఇండియన్స్ వారం వారం, 12% నుండి 38% మంది ప్రతిరోజూ ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్యలను ఎదుర్కొంటున్నారని సమాచారం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. 20 నుండి 40 ఏళ్ల వయసున్న యువతలో జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. సమయపాలన లేకపోవడం, ప్రాసెస్డ్-జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన ఈ వయసు వారు జీర్ణ వ్యవస్థ సంబంధిత అనారోగ్యాలకు గురి అవుతున్నారు.

సాధారణ జీర్ణ సమస్యలు
ఎసిడిటీ-గ్యాస్ట్రిక్: తిన్న ఆహారం గుండెల్లోనే ఉన్న భావన కలుగుతుంది. పుల్లటి త్రేన్పులు, ఛాతీలో మంటగా ఉంటుంది. తల తిరుగుతున్న ఫీలింగ్ సైతం కలుగుతుంది.
కడుపు ఉబ్బరం: మనం తీసుకున్న ఆహారం సరిగా అరగకపోతే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఒక్కోసారి కూర్చోవడానికి, నిల్చోవడానికి, పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.
మలబద్ధకం: ఆహారంలో పీచు పదార్థాల లోపం ఉంటే ప్రేగుల్లో కదలికలు మందగిస్తాయి. దీని వలన సుఖ విరోచనం అవదు. ఇది మలబద్దకానికి దారి తీస్తుంది.
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్: కడుపు నొప్పి, విరోచనాలు లేదా మలబద్ధకం వంటి సమస్యలు వెంటాడుతున్న తరుణంలో దీర్ఘకాలంలో ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గా మారే అవకాశం ఉంది.
ఇన్ఫెక్షన్స్: జీర్ణ వ్యవస్థ సమస్యలు పలు రకాల ఇన్ఫెక్షన్స్ కి దారితీస్తాయి. హెచ్. పైలోరి అను బ్యాక్తీరియా వలన కడుపులో పుండ్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడవచ్చు.
జీర్ణ వ్యవస్థ సమస్యలకు ప్రధాన కారణాలు
ఆహారపు అలవాట్లు: మెజారిటీ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఆహారపు అలవాట్లే కారణం. నూనె అధికంగా ఉండే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు. మైదా, మసాలాలు గట్ హెల్త్ ని దెబ్బతీస్తాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా జంక్ ఫుడ్ మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఫైబర్ లేని ఆహారం: ప్రతిరోజూ కనీసం 30 గ్రాముల పీచు పదార్థం శరీరానికి అవసరం అంటున్నారు నిపుణులు. కాగా కొన్ని అధ్యయనాల ప్రకారం అందులో సగం అంటే 15 గ్రాముల పీచు పదార్థం మాత్రమే తింటున్నారు. ఫైబర్ కంటెంట్ లేని ఆహార పదార్థాలు తినడం జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.
ఒత్తిడి-నిద్రలేమి: సరిపడా నిద్రలేకపోతే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి జీర్ణక్రియను మెరుగుపరిచే మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తుంది. దాంతో జీర్ణ క్రియ మందగించి సమస్యలు మొదలవుతాయి.
యాంటీబయాటిక్స్ వాడకం: అధిక మోతాదులో, తరచుగా యాంటీబయాటిక్స్ వాడకం కూడా గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఓ కారణం అంటున్నారు. యాంటీబయాటిక్స్ సైతం ప్రేగుల్లోని మంచి బ్యాక్తీరియాను చంపేస్తాయి.
గట్ హెల్త్ ని మెరుగుపరిచే విధానాలు
ఆహార చిట్కాలు
ప్రోబయోటిక్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. ఇంటిలో తయారు చేసిన పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన పిండితో ఆహార పదార్థాలు ప్రతిరోజూ తీసుకోవాలి. ఇవి ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి.
ప్రీబయోటిక్స్ కేటగిరీలోకి వచ్చే ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, ఓట్స్ వంటి ఆహార పదార్థాలు జీవ క్రియను మెరుగుపరుస్తాయి. మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహకరిస్తాయి.
పీచు పదార్థం అధికంగా ఉండే రాగులు, జొన్నలు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, జామ, బొప్పాయి పండ్లను రోజూ ఆహారంలో చేర్చుకోండి. వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.
సాంప్రదాయ దినుసులు అయిన వాము, జీలకర్ర, అల్లం, మెంతులు, సోంపు… జీర్ణ శక్తిని పెంచి గ్యాస్ సమస్యలకు చెక్ పెడతాయి.
లైఫ్ స్టైల్
శరీరానికి తగినంత నీరు అందించండి. రోజులో కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీటిని తప్పకుండా తాగండి. నీరు డీహైడ్రేషన్ తగ్గించడంతో పాటు ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తుంది.
ఆహారాన్ని మెల్లగా మెత్తగా నమిలి తినాలి. సరిగా నమలకుండా తింటే ఆహారం జీర్ణం కాదు. ఆహారం నెమ్మదిగా తినాలి. బాగా నమిలిని తర్వాతే మింగాలి.
కనీసం 7 నుండి 8 గంటలు నిద్రకు కేటాయించండి. ప్రశాంతమైన నిద్ర జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా అవసరం.
రోజూ ఓ 30 నిమిషాలు యోగా లేదా వ్యాయామం చేయండి. కొన్ని రకాల యోగాసనాలు జీర్ణ సమస్యలకు చెక్ పెడతాయి. ఈ విధంగా ఆహారపు అలవాట్లతో పాటు జీవనశైలి మార్చుకోవడం ద్వారా గట్ హెల్త్ ని మెరుగుపరుచుకోండి.
