ప్రపంచవ్యాప్తంగా AI(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం పరిమితులు దాటేస్తుంది. దిగ్గజ వ్యాపార సంస్థలు వస్తువులు ఉత్పత్తి చేయడానికి, సేవలు అందించేందుకు AIని ప్రధానంగా వాడుతున్నాయి. AI ఎంట్రీతో ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ఇప్పటికే పలు రంగాలకు చెందిన ఉద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా జాబ్స్ కోల్పోయారు. మరోవైపు AI వినోద సాధనంగా మారింది. నిమిషాల వ్యవధిలో నచ్చిన ఫోటో, వీడియో క్రియేట్ చేసేందుకు AIతో సాధ్యమైంది.
తమ ఫోటోను నచ్చిన విధంగా క్రియేట్ చేసుకునేందుకు గంటల తరబడి ఫోటోషాప్ తో కుస్తీ పట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఎలాంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, టూల్స్ వాడకుండానే… వీడియో తయారు చేయవచ్చు. చాట్ జీపీటీ, జెమినీ AI, క్లౌడ్, మైక్రోసాఫ్ట్ కాపీలాట్ వంటి ప్రధాన AI టూల్స్ అద్భుతాలు చేస్తున్నాయి. రామాయణ, మహాభారత ఘట్టాలను AIలో క్రియేట్ చేస్తున్నారు. తమ ఫేవరేట్ హీరోని ఊహించుకున్న పాత్రలో సన్నివేశాలు రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకులు సైతం విస్తుపోయేలా సదరు వీడియోలు ఉంటున్నాయి. సినిమాటిక్ విజువల్స్ కి అంత దగ్గరగా క్రియేట్ చేయడం మిరాకిల్ అని చెప్పాలి.
అయితే AIతో ఒనగూరే ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువనే ఆందోళన వినిపిస్తుంది. యువత AIని వినియోగిస్తున్న తీరు కంగారు పెట్టిస్తుంది. తమని తాము కొత్తగా ఆవిష్కరించుకోవాలనే క్రమంలో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయడం ప్రమాదం అంటున్నారు. ఇది మన ప్రైవసీకి పెను ముప్పుగా మారొచ్చు. మన ఫేషియల్ ఫీచర్స్ వ్యాపార అభివృద్ధికో, మరో విధంగానో దుర్వినియోగం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

AI ఎంత ప్రమాదం అంటే?
ప్రైవేట్ ఫోటోలు అప్లోడ్ చేయడం అత్యంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఒక్కసారి అప్లోడ్ చేసిన ఫోటో లేదా వీడియో సదరు సంస్థ పర్మినెంట్ డిజిటల్ అసెట్ గా మారిపోతుంది. ఆ ఫోటో తొలగించే అధికారం నీకు ఉండదు.
మోడల్ ట్రైనింగ్: AI సంస్థలు తమ వ్యాపారవృద్దికి మీ పర్సనల్ డేటా మిస్ యూస్ చేయవచ్చు. అంటే మీ అనుమతి లేకుండా ఆల్గోరిథమ్స్, కమర్షియల్ మోడల్స్ ని డెవలప్ చేసుకునేందుకు ట్రైనింగ్ డేటాగా వాడవచ్చు. ఒకసారి మీ ఫేషియల్ ఫీచర్స్… మోడల్స్ గా రూపొందాయి అంటే, AI వాటిని గుర్తు పెట్టుకొని, పదే పదే రీప్రొడ్యూస్ చేయవచ్చు.
బయోమెట్రిక్ డేటా బ్రీచ్: మన ముఖం డిజిటల్ సిగ్నేచర్ వలె పని చేస్తుంది. మనం క్లియర్ ఫొటోస్ అప్లోడ్ చేయడంతో సదరు డాటాను పర్మినెంట్ డిజిటల్ సిగ్నేచర్ లా వాడుకునే అవకాశం ఉంది. ఈ డేటా AI టూల్స్ కి చేరడం వలన డిజిటల్ సిగ్నేచర్స్ విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. భవిష్యత్ లో మీ డిజిటల్ సిగ్నేచర్ మీ ఆధీనంలో ఉండకపోవచ్చు. ఇదొక సీరియస్ ప్రాబ్లం గా పరిగణించాలి.
డీప్ ఫేక్ వీడియోస్: డీప్ ఫేక్ వీడియో సమస్యతో కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మీ ఫోటోలతో అసభ్యకరమైన డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమీయవచ్చు. AI లో మీరు అప్లోడ్ చేసే ఫోటోలు భవిష్యత్ లో ఫేస్ స్వాప్డ్ మీడియా, సోషల్ మీడియా స్కామ్స్ కి కారణం కావచ్చు. తద్వారా మీ ఇమేజ్ డ్యామేజ్ కావచ్చు.
లొకేషన్ లీక్స్: AI లో అప్లోడ్ చేసే ఫోటోలతో మీ లొకేషన్ లీక్ అవుతుంది. జీపీఐ లొకేషన్ ట్రాక్ చేయడం మోసగాళ్లకు సులభం అవుతుంది. మీరున్న కచ్చితమైన లొకేషన్ తో పాటు మీ అలవాట్లు, అభిరుచులు ఇతరులు తెలుసుకోగలరు. డేటా బ్రీచ్ కావడం వలన మీ సమాచారం థర్డ్ పార్టీ చేతుల్లోకి వెళుతుంది. మీ ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ కావచ్చు.
ప్రమాదంలో జెన్ జీ
తాజా గణాంకాల ప్రకారం జెన్ జీ AI ఆప్స్ ని అధికంగా ఉపయోగిస్తున్నారు. 12 నుండి 21 ఏళ్ల వయసున్న యువత AI టూల్స్ ని వాడుతున్నట్లు గమనించారు. మానసిక సమస్యలకు AIని పరిష్కారాలు అడగడం జెన్ జీ ప్రమాదంలో పడ్డట్లు సూచిస్తుంది. ఆరోగ్య సలహాల కోసం 40% పైగా యువత నెలకోసారి AIని సంప్రదిస్తున్నారట. 5% పైగా జెన్ జీ బ్యాచ్ ప్రతిరోజూ… AIని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారట.
మానసిక సమస్యలకు AIని పరిష్కారాలు అడగడం అత్యంత ప్రమాదకరం. AI పూర్తి స్థాయిలో మనుషుల సమస్యలు, ఎమోషన్స్ అర్థం చేసుకునే స్థాయికి ఎదగలేదు. కాబట్టి ఒత్తిడి, ఆందోళన, ఆత్మహత్య వంటి ఆలోచనలతో ఉన్న జెన్ జీ… AI సమాచారంతో ముందుకు వెళ్లే ఆస్కారం కలదు. AI సమస్యను సరిగా అంచనా వేయకుండా పరిష్కార సూచనలు చేస్తే, అవి అనర్థాలకు దారితీయవచ్చు.
కాబట్టి మిమ్మల్ని మీరు వీడియోలు, ఫోటోల రూపంలో కొత్తగా చూసుకోవాలని, గర్ల్ ఫ్రెండ్ లేదా మిత్రులతో ఉన్న ఫోటోలు AIలో పోస్ట్ చేయడం అత్యంత హానికరం. భవిష్యత్తులో మీరు ఊహించని సమస్యల బారినపడొచ్చు. AIలో ఫోటోలు పోస్ట్ చేయకపోవడమే మంచిది. అలాగే అనారోగ్య సమస్యలకు AIని పరిష్కారాలు అడకండని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఒంటరితనం, డిప్రెషన్ వంటి సమస్యలకు పరిష్కారాల కొరకు AI ఇచ్చే సమాచారం, సరికాకపోవచ్చు. అది మిమ్మల్ని మరిన్ని సమస్యల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. ఈ విషయాలు పరిగణలోకి తీసుకుని AIని పరిమితంగా, కొన్ని విషయాల కొరకే ఉపయోగించడం మంచిది.
