పలు సందర్భాల్లో వ్యాయామం సైతం ప్రాణాంతకం అవుతుంది. జిమ్ లో కసరత్తులు చేస్తూ హార్ట్ అటాక్ కి గురవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వయసుతో సంబంధం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాయామం గుండె ఆరోగ్యానికి మంచిదే. అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన అవగాహన లేకుండా హెవీ వర్క్ అవుట్స్ చేయడం సరికాదు.
ఫిట్ గా కనిపించడం సోషల్ స్టేటస్ గా మారింది. పలువురు అందం, ఆరోగ్యం కోసం జిమ్ ల బాటపడుతున్నారు. అన్ని తరగతుల వారు వ్యాయామం చేస్తున్నారు. అయితే జిమ్ చేసే సమయంలో నిపుణుల పర్యవేక్షణ అవసరం. మీ వ్యాయామం సురక్షితం కావాలంటే వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, పాటించడం ద్వారా… ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. అలాగే ఆరోగ్యంగా ఉండొచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం…

ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి:జిమ్ లో చేరే ముందు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. ముఖ్యంగా ECG, 2D ఇకో, ట్రెడ్ మిల్ టెస్ట్ వంటి పరీక్షలు మీ గుండె ఆరోగ్య పరిస్థితి తెలియజేస్తాయి. అధిక రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారు. కుటుంబంలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లెమ్ హిస్టరీ ఉంటే… కార్డియాలజిస్ట్ సలహా తీసుకోండి.
వార్మ్ అప్-కూల్ డౌన్ టెక్నీక్:జిమ్ కి వెళ్లిన వెంటనే అధిక బరువులు ఎత్తడం, ట్రెడ్ మీద వేగంగా పరిగెత్తడం చేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వలన ఒక్కసారిగా గుండె ఒత్తిడికి గురవుతుంది.
వార్మ్ అప్: వ్యాయామానికి ముందు 10 నుండి 15 నిమిషాలు తేలికపాటి స్ట్రెచింగ్, వాకింగ్ చేయడం మంచిది. వార్మ్ అప్ గుండె స్పందన క్రమంగా పెరుగుతుంది. రక్తం శరీరం సరఫరా అవుతుంది.
కూల్ డౌన్: వర్క్ అవుట్ పూర్తయ్యాక కూడా ఒక్కసారిగా రిలాక్స్ కాకూడదు. గుండె వేగాన్ని క్రమంగా సాధారణ స్థితికి తీసుకురావాలి. జిమ్ తర్వాత కూడా కాసేపు మెల్లగా నడవండి.
అతిగా వ్యాయామం చేయకండి: మన శరీరం భరించగల స్థాయికి మించి వ్యాయామం చేయకండి. ఇతరులను చూసి గంటల తరబడి కఠినంగా వ్యాయామం చేయడం, హెవీ వెయిట్స్ ఎత్తడం ప్రమాదకరం. క్రమంగా వ్యాయామం సమయం పెంచవచ్చు. దానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు.
రెస్ట్- నిద్ర అవసరం: శరీరానికి సరైన విశ్రాంతి, నిద్ర లేకపోతే గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. వ్యాయామం చేసే వారు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. తగు నిద్ర లేని రోజున జిమ్ లో తేలికపాటి వ్యాయామం చేయడం ఉత్తమం. వారంలో కనీసం ఒకటి రెండు రోజులు జిమ్ చేయకపోవడం మంచి. ఆ విధంగా మీ శరీరానికి, కండరాలకు విశ్రాంతి లభిస్తుంది.
శ్వాస నియంత్రణ: బరువులు ఎత్తే క్రమంలో చాలా మంది ఊపిరి గట్టిగా బిగపట్టి ఉంచుతారు. ఇది ప్రమాదకరం. ఊపిరి బిగపట్టడం వలన బ్లడ్ ప్రెజర్ వేగంగా పెరుగుతుంది. ఇది హార్ట్ అటాక్ కి దారి తీయవచ్చు. ఊపిరి సాధారణంగా, క్రమబద్ధంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
హైడ్రేషన్: శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి. బాడీ డీహైడ్రేట్ అయితే రక్తం చిక్కబడి, రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడవచ్చు. వర్క్ అవుట్ చేసే సమయంలో మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీరు త్రాగండి. చెమట రూపంలో నీరు బయటకు పోతుంటే… ఎలక్ట్రోలైట్స్ లేదా నిమ్మరసం తీసుకోండి.
హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దు: వర్క్ చేసే క్రమంలో శరీరంలో కనిపించే ప్రమాదకర హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి.
ఛాతిలో నొప్పి, లేదా మంట లేదా ఒత్తిడిగా అనిపించడం. గొంతు, దవడలు, ఎడమ చేయి లేదా వీపు భాగంలో నొప్పి రావడం… హార్ట్ అటాక్ కి సూచనలు కావచ్చు. విపరీతంగా కళ్ళు తిరగడం, కళ్ళు మూసుకుపోతున్నట్లు అనిపించడం, అసాధారణంగా ఆయాసం రావడం, ఊపిరి అందకపోవడం… వంటి లక్షణాలు కనిపిస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.
ఫిట్నెస్ సోషల్ స్టేటస్ గా భావిస్తున్న రోజుల్లో… చాలా మంది వ్యాయామం చేస్తున్నారు. అయితే అది మన ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలి. జిమ్ ట్రైనర్ పర్యవేక్షణలో మీ శరీర స్థాయికి తగిన వ్యాయామం మాత్రమే చేయాలి. అవగాహన లేకుండా అధిక బరువులు ఎత్తడం, గంటల తరబడి శ్రమించడం అత్యంత ప్రమాదకరం. కాబట్టి పైన సూచించిన విషయాలు పరిగణలోకి తీసుకుని వ్యాయామం చేయండి.
