సౌత్ ఇండియా రాజకీయాలపై నటులు చెరగని ముద్ర వేశారు. కొందరైతే దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేశారు. తమ సీనియర్స్ నుంచి స్ఫూర్తి పొంది చాలా మంది నటులు రాజకీయ అరంగేట్రం చేశారు. వారిలో కొందరు మాత్రమే పొలిటికల్ వార్ లో సత్తా చాటారు.
వెండితెరపై రాణించినంత ఈజీగా రాజకీయాల్లో రాణించలేరు. ఇది క్లిష్టమైన లాంగ్ టర్మ్ జర్నీ. ఓవర్ నైట్ లో ప్రజాభిమానం పొందడం కష్టమే. అయితే కొందరు నటులు మిరాకిల్స్ చేస్తారు. దశాబ్దాలుగా సీఎం సీటు కోసం కలగంటున్న వారికి చుక్కలు చూపిస్తూ… ఆ స్థానాన్ని నెలల వ్యవధిలో కైవసం చేసుకున్నారు. అదే సమయంలో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న బడా స్టార్స్ సైతం చతికిలబడ్డారు.
టాలీవుడ్ టాప్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నారని, అందుకు రంగం సిద్ధమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో… పాప్యులర్ స్టార్ పొలిటికల్ జర్నీ చూద్దాం…

బ్లాక్ బస్టర్
తమిళ ప్రేక్షకుల ఆరాధ్య నటుడు ఎంజీఆర్(ఎంజీ రామచంద్రన్) 1972లో రాజకీయ అరంగేట్రం చేశారు. DMK పార్టీకి వ్యతిరేకంగా ఆల్ ఇండియా అన్నాడీఎంకే(AIADMK) పార్టీని స్థాపించారు. 1977 ఎన్నికల్లో అన్నాడీఎంకే అఖండ విజయం సాధించింది. తమిళనాడు సీఎం పీఠం అధిరోహించిన ఎంజీఆర్ మరణించే(1987) వరకు సీఎంగా ఉన్నారు.
ఎన్టీఆర్
ఎంజీఆర్ స్ఫూర్తితో లెజెండ్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలుపొందారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్.. 1983లో భారీ మెజారిటీతో గెలిచి, సీఎం అయ్యారు. మరో రెండు పర్యాయాలు ఎన్టీఆర్ సీఎంగా విజయం సాధించారు.
జయలలిత
తమిళనాడు రాజకీయాల్లో జయలలిత ఒక సెన్సేషన్. ఎంజీఆర్ వారసురాలిగా అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టిన జయలలిత… 1991లో మొదటిసారి తమిళనాడు సీఎం అయ్యారు. అనంతరం మరో ఐదు పర్యాయాలు సీఎంగా విజయం సాధించారు.
దళపతి విజయ్
2024 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం జరిగింది. ఎవరూ ఊహించని ఫలితాలు నమోదు అయ్యాయి. కోలీవుడ్ స్టార్ జోసెఫ్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) అత్యధిక సీట్లు గెలుచుకొని లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇతర పార్టీల మద్దతుతో సీఎం అయిన విజయ్, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడు.
జస్ట్ హిట్
విజయ్ కాంత్
90లలో స్టార్ గా వెలుగొందిన విజయ్ కాంత్ 2005లో దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం(DMDK) పార్టీ స్థాపించారు. 2006లో జరిగిన ఎన్నికల్లో వ్రిదాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2011 ఎన్నికల్లో 29 స్థానాలు గెలుచుకున్న విజయ్ కాంత్… AIDMK తో కలిసి శాసనసభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే ఆయన రాజకీయ లెగసి కొనసాగలేదు.
పవన్ కళ్యాణ్
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన అనంతరం 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి ఆయన పోటీ చేశారు. ఘోర పరాజయం చవి చూసిన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయం పొందారు. ఒక్క అసెంబ్లీ స్థానం మాత్రమే జనసేన గెలుచుకుంది.
2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి… పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి, 100% స్ట్రైక్ రేట్ నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా హిట్ అని చెప్పొచ్చు.
అట్టర్ ప్లాప్
చిరంజీవి
భారీ స్టార్డం కలిగిన చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పీఆర్పీ పోటీ చేసింది. కేవలం 18 స్థానాలు మాత్రమే PRPకి దక్కాయి. 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చిరంజీవి… యూనియన్ మినిస్టర్ అయ్యారు. 2014 నుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
రజినీకాంత్
రజినీకాంత్ ఫ్యూచర్ తమిళనాడు సీఎం అని ఫ్యాన్స్ భావించారు. రాజకీయాల్లోకి వస్తానంటూ దశాబ్దాల పాటు ఊరించిన రజినీకాంత్ అనంతరం ఉసూరు మనిపించారు. అనారోగ్య సమస్యల రీత్యా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. విజయ్ విజయం అనంతరం రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.
కమల్ హాసన్
2018లో మక్కల్ నీది మయ్యం (MNM) పేరుతో పార్టీ స్థాపించిన కమల్ హాసన్…2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్క సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. కమల్ హాసన్ సైతం ఓడిపోయారు. ఇటీవల DMK కూటమి మద్దతుతో రాజ్యసభకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఎంపీ హోదాలో ఉన్నారు.
విజయశాంతి, సుమన్, మోహన్ బాబు, ఉపేంద్ర, సురేష్ గోపి, కార్తీక్ తో పాటు పలువురు నటులు రాజకీయాల్లోకి వచ్చారు. ఎలాంటి ప్రభావం చూపకుండానే నిష్క్రమించారు. కొందరు చిన్న చిన్న పదవుల్లో కొనసాగుతున్నారు.
