‘ధనం మూలం ఇదం జగత్’ అన్నారు పెద్దలు. ఈ ప్రపంచం డబ్బు చుట్టే తిరుగుతుంది. రూపాయి లేకపోయితే రోజు గడవదు. ఒక మనిషి సోషల్ స్టేటస్ నిర్ణయించేది డబ్బే. మొత్తంగా చెప్పాలంటే మనిషి పుట్టుక నుండి చచ్చే వరకు నడిపించే ఇంధనం ధనమే. మరి డబ్బుకు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి… దాని చుట్టూ జరిగే మోసాలు కూడా ఎక్కువే.
కష్టపడకుండా డబ్బులురావు. చెమటోడ్చి రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించే కూలీ నుండి… నిమిషానికి పది కోట్లు సంపాదించే ఎలన్ మస్క్ వరకు డబ్బు కోసం కష్టపడాల్సిందే. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కలిగిన బిజినెస్ టైకూన్స్… విధులు వదిలేసి విలాసంగా జీవిస్తారు అనుకుంటే పొరపాటే. సింపుల్ గా చెప్పాలంటే నిరంతరం కష్టపడే వారితోనే సంపద ఉంటుంది. లేదా మెల్లగా అది ఆవిరైపోతుంది.
ఇక కష్టపడకుండా ఓవర్ నైట్ కోటీశ్వరులు అయిపోవాలని భావించే ఛీటర్స్ కి కొదవేమీ లేదు. ఇతరుల అమాయకత్వాన్ని, బలహీనతలను అనుకూలంగా మార్చుకుని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలకు అదుపులేదు. వివిధ మార్గాల ద్వారా ఒక్క ఇండియాలోనే ఏడాదికి రూ. 22000 కోట్ల విలువైన సైబర్ మోసాలు జరుగుతున్నాయని అంచనా.
ఈ క్రమంలో ఆర్థిక ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొత్తవారితో లక్షలు, కోట్లలో ఆర్థిక వ్యవహారాలు నెరిపే క్రమంలో తెలివిగా వ్యవహరించాలి. అప్పులు, ఉమ్మడి వ్యాపారం, ప్రాపర్టీ కొనుగోళ్లు-అమ్మకాలు, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ వంటి కీలక ఆర్థిక లావాదేవీల్లో.. మోసాలకు ఆస్కారం లేకుండా జాగృతితో మెలగాలి. ఇక మనీ డీల్స్ దాడులు, హత్యలు వంటి క్రైమ్స్ కి దారి తీస్తున్నాయి.

P2P ట్రాన్స్ఫర్స్ చేయకండి
బ్యాంకు ప్రమేయం లేకుండా పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ ప్రమాదకరం. క్రిప్టో కరెన్సీ, వైర్ ట్రాన్స్ఫర్స్ ని ట్రేస్ చేయడం కష్టం. లీగల్ గా మద్దతు లభించదు. నేరుగా క్యాష్ రూపంలో చెల్లింపులకు కూడా సరైన ఆధారాలు ఉండవు కావున మోసగాళ్లకు తమ పని సులువు అవుతుంది.
డిజిటల్ రిసిప్ట్స్ ని నమ్మకండి
మొబైల్ మెస్సేజ్‌లు, ఈమెయిల్స్, స్క్రీన్ షాట్స్ వంటి డిజిటల్ రిసిప్ట్ లను నమ్మకండి. అవి ఫేక్ రిసిప్ట్స్ కావచ్చు. మన అధికారిక బ్యాంకు ఖాతాలో డబ్బు జమైందని నిర్ధారించుకున్న తర్వాతే… డీల్ క్లోజ్ చేయండి.
ఓటీపీ షేర్ చేయకండి
బ్యాంకులు లేదా ఆథరైజ్డ్ ఫైనాన్సియల్ సంస్థలు, కంపెనీలు.. ఖాతా వివరాలు, ఓటీపీలు వంటి సున్నిత సమాచారాన్ని అడగవు. తెలియని వ్యక్తులకు ఈ సమాచారం షేర్ చేస్తే బ్యాంకు బ్యాలన్స్ నిల్ కావచ్చు. అందుకే కొత్తవారితో ఇలాంటి సమాచారం షేర్ చేసే ముందు తగు జాగ్రత్తలు పాటించండి. ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోండి.
సురక్షితమైన ప్రదేశాల్లో కలవండి
కొత్తవారు లేదా ఇటీవల పరిచయమైన వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు ప్రమాదకరం. అందుకే వారితో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సేఫ్ జోన్ ఎంచుకోవాలి. జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో కలవాలి. పోలీస్ స్టేషన్స్ కి లేదా వెంటనే సహాయం లభించే ప్రాంతాలకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. నగరాలకు దూరంగా ఉండే నిర్జన ప్రదేశాల్లో కలవకండి. తోడుగా నమ్మదగిన వ్యక్తులను తీసుకెళ్లండి.
అగ్రిమెంట్ క్లియర్ గా ఉండేలా చూస్కోండి
విలువైన ఆస్తులు, వాహనాలు, వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో… ఎలాంటి లొసుగులకు తావు లేకుండా స్పష్టమైన అగ్రిమెంట్ రాసుకోండి. దానిపై ఇరు పార్టీలు సంతకం చేసేలా చూస్కోండి.
ఆధారాలు భద్రపరుచుకోండి.
మన ఆర్థిక ఒప్పందానికి సంబంధించిన ప్రతి కీలక డాక్యుమెంట్స్, ఆధారాలు భద్రపరుచుకోండి. వాయిస్ కాల్/వీడియో కాల్ రికార్డ్స్, ఛాటింగ్, ట్రాన్సక్షన్స్ స్క్రీన్స్ షాట్స్ కూడా సేవ్ చేసుకోండి.
ఇలాంటి వారిని నమ్మకండి
ఆర్థిక లావాదేవీల్లో తొందరపెట్టే వ్యక్తులను సులభంగా నమ్మకండి. త్వరగా డీల్ క్లోజ్ చేయాలి, ఇది చాలా అర్జెంటు, లేదంటే అవకాశం కోల్పోతాం అంటూ హడావుడి చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. అన్నీ సవ్యంగా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఒప్పందం చేసుకోవాలి.
ఓవర్ పేమెంట్ ఫ్రాడ్స్
కొందరు మనకు ఇవ్వాల్సిన మొత్తం కంటే అధిక మొత్తంలో చెక్ రూపంలో చెల్లించి.. బ్యాలన్స్ ఓవర్ పేమెంట్ వెంటనే చెల్లించమని కోరవచ్చు. ఒకవేళ చెక్ బౌన్స్ అయితే మీ అమౌంట్ తిరిగిరాదు. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకొని… ఆర్థిక మోసాలపట్ల అప్రమత్తంగా ఉండండి.
