పలు మతాచారాలలో ఉపవాసం ఆధ్యాత్మిక చర్యగా ఉంది. తమ ఇష్ట దైవం అనుగ్రహం పొందేందుకు, కోరికలు తీరేందుకు ఉపవాసం ఆచరిస్తారు. సోమవారం శివ భక్తులు, శనివారం వెంకటేశ్వర స్వామి భక్తులు ఉపవాసం ఉండటం మనం చూడొచ్చు. ఇక ముస్లింలు అయితే రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాసం ఉంటారు. దీన్ని వారు రోజా(Roza) అంటారు. ఉదయం 4-5 గంటల మధ్య రోజా ఆరంభమై సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో ముగుస్తుంది. రోజా సమయంలో వారు కనీసం లాలాజలం కూడా మింగరు.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమకారులు నిరసనలు చేస్తారు. నిరసన విధానాల్లో నిరాహార దీక్ష అత్యంత ప్రభావవంతమైనది. ఈ దీక్ష చేపట్టినవారు తమ డిమాండ్స్ నెరవేరే వరకు ఎలాంటి ఆహారం, పానీయాలు తీసుకోరు. కాగా ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా? లేక నష్టం కలిగిస్తుందా? అనే సందేహాలు ఉన్నాయి. ఉపవాసం గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో చూద్దాం..

ఉపయోగాలు:
బరువు తగ్గుతారు
ఆహారం తీసుకోకపోవడం వలన శరీరం తనకు కావాల్సిన పోషకాల కోసం కొవ్వును వాడుకుంటుంది. దాంతో కొవ్వు శాతం తగ్గి వెయిట్ లాస్ అవుతారు. అధిక బరువు ఉన్నవారు ఉపవాసం చేయడం వలన కొంత మేర మేలు పొందవచ్చు.
జీర్ణ వ్యవస్థకు విరామం
రోజంతా మనం ఏదో ఒకటి తింటూనే ఉంటాం. అలాగే రకరకాల పానీయాలు సేవిస్తాం. శరీరంలోకి ఆహారం వెళ్లిన ప్రతిసారి జీర్ణ వ్యవస్థ యాక్టీవ్ అవుతుంది. ఉపవాసం కారణంగా జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. మనకు ఆదివారం వలె అన్నమాట. ఉపవాసంతో ప్రేగుల ఆరోగ్యం, జీర్ణ శక్తి మెరుగవుతాయి.
టాక్సిన్స్ ఫ్రీ బాడీ
శరీరంలో వివిధ కారణాలతో ఉత్పత్తి అయ్యే విష పదార్థలు, వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లేందుకు ఉపవాసం దోహదం చేస్తుంది. శరీరం శుద్ధి కావడానికి ఉపవాసం ఒక పరిష్కారం.
చెక్కెర స్థాయిల నియంత్రణ
ఉపవాసం వలన శరీరంలోని చెక్కెర స్థాయి నియంత్రణలోకి వస్తుంది. టైప్-2 షుగర్ వ్యాధి సోకకుండా ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది. ఉపవాసంతో కలిగే ప్రయోజనాల్లో ఇది ఒకటి.
గుండెకు మేలు
ఉపవాసంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి గణనీయంగా తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ కారణాల వలన గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.
కణాల పునరుత్పత్తి
ఉపవాస సమయంలో శరీరం పాత, పాడైపోయిన కణాలను తొలగిస్తుంది. వాటి స్థానంలో కొత్త కణాలను అభివృద్ధి చేస్తుంది. ఇది ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చుతుంది.
నష్టాలు:
కండరాలు క్షీణిస్తాయి
రోజుల తరబడి లేదా తరచుగా ఉపవాసం చేయడం వలన కొవ్వుతో పాటు కండరాల బలం క్షీణిస్తుంది. దాంతో శరీరం పటుత్వం కోల్పోయే ప్రమాదం ఉంది.
అసిడిటీ అండ్ గ్యాస్
ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోవడం వలన కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్స్ శాతం పెరిగి… మంట, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు చుట్టుముడతాయి.
అతిగా తినే ప్రమాదం
ఉపవాసం ముగిసిన వెంటనే చాలా మంది ఆకలిని తట్టుకోలేక అధిక మొత్తంలో తినేస్తారు. అలాగే అందుబాటులో ఉన్న జంక్ ఫుడ్ తినే ఆస్కారం ఉంది. ఒక్కసారిగా అధిక ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ దెబ్బతింటుంది.
నీరసం, ఏకాగ్రత లోపించడం
ఖాళీ కడుపుతో విధులు నిర్వహించడం కష్టం. రోజంతా నీరసంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన క్యాలరీలు లభించకపోవడం వలన తలనొప్పి, అలసట ఆవహిస్తాయి.
వీళ్లు ఉపవాసం చేయకూడదు
గర్భిణీ స్త్రీలు, టైప్- 1 డయాబెటిస్ తో బాధపడుతున్నవారు ఉపవాసం చేయకూడదు. ఇన్సులిన్ తీసుకునే రోగులు ఉపవాసం ఆచరిస్తే షుగర్ లెవెల్స్ పడిపోయే ప్రమాదం ఉంది. అలాగే చిన్నారులు, వృద్ధులు ఉపవాసం చేయకూడదు.
ఉపవాసం-జాగ్రత్తలు
నీళ్లు ఎక్కువగా తాగాలి. బాడీ డీ హైడ్రేడ్ కాకుండా చూసుకోవాలి.
ఆరంభంలో 24 గంటలకు బదులు 12 గంటల ఉపవాసం ఉండండి.
ఉపవాసం ముగించిన తర్వాత మితంగా ఆహారం తీసుకోండి. పండ్లు, బాదం, మజ్జిగ బెటర్.
ఖాళీ కడుపుతో పాలు, చక్కెర ఉన్న టీ, కాఫీ తాగితే ఎసిడిటీ సమస్య రావచ్చు.
శరీరాన్ని గమనించండి. మరీ నీరసంగా, కళ్ళు తిరిగినట్లు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
