E20 పెట్రోల్ ఇండియాలో హాట్ టాపిక్. దీని వినియోగంతో తమ వాహనాలు పాడవుతున్నాయని, మైలేజ్ గణనీయంగా తగ్గిపోయిందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు E20 పెట్రోల్ అంటే ఏమిటీ? దీనిపై వివాదం ఏమిటీ? నిజంగానే E20 పెట్రోల్ వాహనాలకు హాని చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు? కేంద్ర ప్రభుత్వ వాదన ఏమిటో తెలుసుకుందాం..
అసలు E20 పెట్రోల్ అంటే ఏమిటీ?
20% ఇథనాల్ 80% పెట్రోల్ తో కూడిన పెట్రోల్ ని E20 పెట్రోల్ అంటారు. గతంలో పెట్రోల్ లో 10% ఇథనాల్ మాత్రమే ఉండేది. అయితే కాలుష్యాన్ని నివారించేందుకు, క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గించుకునేందుకు భారత ప్రభుత్వం కొత్తగా E20 పెట్రోల్ ని అందుబాటులోకి తెచ్చింది. 2025 మార్చిలో E20 పెట్రోల్ కి మారే ప్రక్రియ ప్రారంభం కాగా 2026 ఏప్రిల్ నుంచి దేశంలోని అన్ని రిటైల్ పెట్రోల్ పంప్స్ లో E20 అమ్మకాలను ప్రారంభించారు.

E20 పెట్రోల్ తో వివాదం ఏమిటీ?
E20 పెట్రోల్ పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పెట్రోల్ తమ వాహన సామర్ధ్యాన్ని తగ్గించడంతో పాటు, ఇంజిన్ పార్ట్స్ ని దెబ్బ తీస్తుందనేది ప్రధాన ఆరోపణ. కొత్తగా కొన్న తన కారులో E20 పెట్రోల్ కొట్టించగా… కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత 30kmp కంటే వేగంగా వెళ్లడం లేదని ఓ వాహనదారుడు ఆరోపించాడు. దీనికి ఆధారంగా ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అయ్యింది.
E20 వినియోగం వలన ఫ్యూయల్ సిస్టంలోని హోజ్ లు, గాస్కెట్స్, సీల్స్ తో పాటు రబ్బరు భాగాలు పాడయ్యే అవకాశం ఉంది. తక్కువ వినియోగంతోనే వీటిని మార్చుకోవాల్సి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశం పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు కూడా వెల్లువెత్తాయి.
ప్రభుత్వం ఏమంటుంది?
E20 వినియోగంతో వాహనాలు దెబ్బతింటాయి. విడిభాగాలు పాడవుతాయి… అనే ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేస్తుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ E20 వివాదంపై స్పందించారు. తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్న ఆయన… సమస్య ఉన్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. E20 పెట్రోల్ వినియోగం సురక్షితమే, పైగా వాహనాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చుతుందని ప్రభుత్వ వాదన.
ARAI ఏం చెబుతోంది?
E20 పెట్రోల్ వినియోగం పై వాహనదారుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తన నివేదికలో ఆందోళనకర అంశాలు పొందుపరిచింది. E10 పెట్రోల్ కోసం డిజైన్ చేసిన పాత వాహనాల్లో E20 పెట్రోల్ వినియోగం వలన ఇంధన వ్యవస్థలో సమస్యలు ఏర్పడతాయని పేర్కొంది. సహజంగా ఇథనాల్ కి ఉండే తేమను గ్రహించే లక్షణం రబ్బరు భాగాలను బలహీనపరుస్తుందని అంటున్నారు. రబ్బరు విడిభాగాలు పాడయ్యే అవకాశం ఉంది. వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని వెల్లడించారు.
ఎలాంటి వాహనాలపై అధిక ప్రభావం చూపుతోంది?
2023 కంటే ముందు తయారైన వాహనాలకు E20 పెట్రోల్ తో డ్యామేజ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నివేదికల సారాంశం. ఎందుకంటే ఇవి E10 పెట్రోల్ కి అనుగుణంగా రూపొందించబడిన వాహనాలు. అలాగే ఫోర్ వీలర్స్ మీద కూడా E20 పెట్రోల్ ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే టూ వీలర్స్ పై చెప్పుకోదగ్గ స్థాయిలో E20 పెట్రోల్ ప్రభావం చూపడం లేదని నివేదికలు చెబుతున్నాయి. మూడు ప్రధాన టూ వీలర్ కంపెనీలు జరిపిన పరీక్షల్లో E20 పెట్రోల్ హానికరం కాదని తేలినట్లు సమాచారం.
మైలేజ్ పై ప్రభావం ఎంత?
E20 పెట్రోల్ మైలేజ్ పై కచ్చితంగా ప్రభావం చూపుతుందని నివేదికలు చెబుతున్నాయి. మీ వాహనం మోడల్ ని బట్టి 2% నుంచి 6% తగ్గుతుంది. సామాన్యులను ఇది కలవపరిచే అంశమే.
పైన చెప్పిన అంశాలను పరిశీలిస్తే… పాత వాహనాలను వాడేవారు వాటిని వదిలించుకుంటే మంచిది. లేదంటే రిపైర్స్ రూపంలో జేబులు ఖాళీ అవుతాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగే సూచనలు కలవు.
