బ్యాచిలర్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోగల బెస్ట్ వంటకాలు!

ఉరుకుల పరుగుల నగర జీవనంలో జనాలు ఆరోగ్యకర ఆహారం తినడం లేదు. ముఖ్యంగా బ్యాచిలర్స్ ఆన్లైన్ ఫుడ్ లేదా హోటల్ ఫుడ్ కి అలవాటు పడిపోయారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుండి రాత్రి డిన్నర్ వరకు బయటి ఆహారమే వారికి శరణ్యం. కారణం బ్యాచిలర్స్ కి వంటరాదు. వచ్చినా ఫుడ్ ప్రిపేర్ చేసుకునే సమయం ఉండదు. ఒత్తిడితో కూడిన ఐటీ ఉద్యోగులు అయితే చెప్పాల్సిన పని లేదు. ఎడాపెడా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఒక్క క్లిక్ తో క్షణాల్లో ఆహారం అందించే ఫుడ్ డెలివరీ యాప్స్ ఉండగా, ఖర్చుకు వెనుకాడకుండా నచ్చినవి ఆర్డర్ చేసుకుని ఆరగిస్తున్నారు.

అయితే బయటి ఆహారం వలన అటు ఆర్థికంగా, ఇటు ఆరోగ్యపరంగా నష్టపోవాల్సి వస్తుంది. దీర్ఘకాలం హోటల్ ఫుడ్ తింటే పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. హోటళ్లలో ఆహారం తయారీకి ఉపయోగించే నూనెలు, కూరగాయలు, మాంసం సరైనవి కాదని పలు ఉదంతాలు రుజువు చేశాయి. శుభ్రత లేని ప్రదేశాల్లో ఫుడ్ తయారు చేసి, అందమైన ప్యాకెట్ లో నీట్ గా అందిస్తారు. హోటల్ కిచెన్స్ లో పరిస్థితులు స్వయంగా చూస్తే ఒక్కరు కూడా, బయటి ఆహారం తినేందుకు ఇష్టపడరు.

అందుకే కొంచెం బద్ధకం వీడి ఫుడ్ స్వయంగా తయారు చేసుకోవడం ఉత్తమం. కొన్ని రకాల వంటకాలు తక్కువ సమయంలో పెద్దగా కష్టపడకుండానే స్వయంగా తయారు చేసుకోవచ్చు. సదరు వంటకాల తయారీకి నైపుణ్యం అవసరం లేదు. బ్యాచిలర్స్ ఈజీగా తక్కువ సమయంలో వండుకోదగిన కొన్ని వంటకాలను ఈ స్టోరీలో చర్చిద్దాం..

10 నిమిషాల్లో తయారు చేయదగిన మూడు పప్పు వంటకాలు 

తెలుగువారు అధికంగా ఇష్టపడే కూరల్లో పప్పు ఒకటి. పప్పు లేకుండా కొందరి భోజనం పూర్తి కాదు. కేవలం ప్రెజర్ కుక్కర్ ఉపయోగిస్తూ 10 నిమిషాల్లో సులభంగా తయారు చేసుకోదగిన మూడు పప్పుల రకాలను చూద్దాం..

నెయ్యి ఇంగువ పప్పు: పెసర పప్పును కడిగి తగినన్ని నీళ్లు పోసి, కొద్దిగా పసుపు వేసి కుక్కర్ లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఒక బాణలిలో నెయ్యి వేసి మరిగించండి. మరిగిన నెయ్యిలో జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, సన్నగా తరిగిన అల్లం, ఇంగువ తాలింపు వేసి పప్పులో కలపండి. చివరిగా నిమ్మరసం పిండితే అద్భుతమైన రుచి వస్తుంది.

టమాటో కారం పప్పు: కందిపప్పు, టమాటో ముక్కలు, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు కుక్కర్ లో వేయండి. వాటికి తగినన్ని నీరు కలపండి. అనంతరం 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసి పప్పుగుత్తితో మెత్తగా కలియ పెట్టండి. కుదరకపోతే మిక్సీలో వేయండి. అనంతరం ఒక పాత్రలో నూనె వేసి స్టౌవ్ మీద పెట్టండి. నూనె మరిగాక కరివేపాకు, అల్లం, వెల్లుల్లి వేసి దోరగా వేయించండి. ఆ తాలింపులో మెత్తగా చేసిన పప్పు వేసి కలపండి. టమాటో కారం పప్పు రెడీ అవుతుంది.

పాలకూర పప్పు: కందిపప్పుతో పోల్చితే పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది. పప్పుతో పాటు తరిగిన పాలకూర, పచ్చి మిర్చి, ఉప్పు వేసి కుక్కర్ లో ఉడికించండి. అనంతరం పప్పును మెత్తగా చేసి  వెల్లుల్లితో తాలింపు వేయండి. పాలకూర పప్పులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.

ఈజీ స్పైసీ చికెన్ ఫ్రై 

వారాంతాల్లో లేదా రాత్రి వేళల్లో చికెన్ తినాలనుకునే బ్యాచిలర్స్ కి ఇది అనువైన వంటకం. ఎక్కువ మాసాలు, ప్రయాస లేకుండా తక్కువ సమయంలో స్పైసీ చికెన్ ఫ్రై తయారు చేసుకోవచ్చు.

కావలసినవి: బోన్లెస్ చికెన్(250 గ్రాములు), అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నిమ్మరసం, ధనియాల పొడి, నూనె, కరివేపాకు.

తయారీ విధానం: 

ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు కలిపి 5 నిమిషాలు పక్కన ఉంచండి.

బాణలిలో 2 చెంచాల నూనె వేసి వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చి మిర్చి ముక్కలు వేసి ఉడకనివ్వాలి.

మెరినేట్ చేసిన  చికెన్ వేసి మూతపెట్టి సన్నని మంటపై 8 నుండి 10 నిమిషాలు ఉడకనివ్వండి.

చికెన్ ఉడికిన తర్వాత మూత తీసి 2 నిముషాలు నూనెలో వేయిస్తే స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అవుతుంది.

ఐటీ ఉద్యోగుల కోసం ఇన్స్టంట్ బ్రేక్ ఫాస్ట్ 

ఓట్స్ ఉప్మా: బాణలిలో కొద్దిగా నూనె వేసి తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసి వేయించండి. తాలింపు రెడీ అయ్యాక అందులో నీరు పోయండి. మరిగిన నీటిలో ఇన్స్టంట్ ఓట్స్, కొంచెం ఉప్పు వేసి 3 నిమిషాలు ఉడికిస్తే పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ సిద్ధం.

మసాలా బ్రెడ్ టోస్ట్: రెండు గుడ్లను పగలగొట్టి బౌల్ లో కార్చండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసి బాగా కలపండి. బ్రెడ్ ముక్కలను ఈ మిశ్రమంలో ముంచి పెనంపై నెయ్యితో రెండు వైపులా కాల్చుకుంటే నిమిషాల్లో బ్రేక్ ఫాస్ట్ రెడీ అవుతుంది.

పీనట్ బటర్ అండ్ బనానా టోస్ట్:  వంట చేయాల్సిన అవసరం లేకుండా, టోస్ట్ చేసిన బ్రెడ్ పై పీనట్ బటర్ రాసి, అరటిపండు ముక్కలు పరచి తింటే వెంటనే శక్తి లభిస్తుంది.

 

Leave a Comment