సోషల్ మీడియా వాడుతున్నారా? డేంజర్లో పడినట్లే!

సోషల్ మీడియాతో లైఫ్ ముడిపడిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనికి అడిక్ట్ అయ్యారు. ఇండియాలో సగటున 500 మిలియన్ యాక్టీవ్ సోషల్ మీడియా యూజర్స్ ఉన్నారని అంచనా. సరాసరి రోజుకు 2-3 గంటలు వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ కి సమయం కేటాయిస్తున్నారు. యువతలో ఎంగేజ్మెంట్ హౌర్స్ రేట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది.

ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ఎక్స్, ఫేస్ బుక్, షేర్ షాట్, వాట్సప్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. సోషల్ మీడియా వినియోగం పక్కదారి పడుతున్న నేపథ్యంలో… ఉపయోగాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సైబర్ నేరాలకు సోషల్ మీడియా వేదికగా మారింది.

సోషల్ మీడియా ఫ్రాడ్స్ 

ప్రొఫైల్ క్లోనింగ్: ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ నుండి సులభంగా మీ ఫోటోలు, వ్యక్తిగత సమాచారం పొందవచ్చు. ఈ డేటాతో ప్రొఫైల్ క్లోనింగ్ కి పాల్పడుతున్నారు. మీ ఫోటో ప్రొఫైల్ పిక్ గా వాడి, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి… మీ ఫ్రెండ్స్, బంధువులకు అర్జెంట్ గా డబ్బులు కావాలని మెసేజ్లు చేస్తారు. ఎమర్జెన్సీ అని తొందరపెట్టి మీ పేరున వసూళ్లకు పాల్పడతారు.

జాబ్స్&లాటరీ మోసాలు: ఇంట్లో కూర్చుని రోజుకు 2000 సంపాదించండి, 5000 సంపాదించండి వంటి ప్రకటనలతో మోసం చేస్తారు. అలాగే మీకు లాటరీ తగిలింది. రిజిస్ట్రేషన్ ఫీజులు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఫార్మాలిటీస్ అని దోపిడీలకు పాల్పడతారు.

హనీ ట్రాప్: ఇది అత్యంత ప్రమాదకరమైన సోషల్ మీడియా ఫ్రాడ్. అందమైన యువతులతో పరిచయం ఏర్పడేలా చేసి, న్యూడ్ వీడియో కాల్స్ కి ప్రోత్సహిస్తారు. అనంతరం ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తారు. ఎన్ని పర్యాయాలు డబ్బులు చెల్లించినా వదలరు. హనీ ట్రాప్ లో పడి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రైవసీ సెట్టింగ్స్: ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి యాప్స్ లో ప్రైవసీ సెట్టింగ్స్ సెట్ చేసుకోండి. ప్రైవేట్ లేదా ఫ్రెండ్స్ ఓన్లీ మీ ప్రొఫైల్ చూసేలా ఆప్షన్స్ పెట్టుకోండి. అప్పుడు మోసగాళ్లు మీ ప్రొఫైల్ నుండి ఫోటోలు, సమాచారం దొంగిలించే అవకాశం ఉండదు.

టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ కోడ్: ఒక్కోసారి మన సోషల్ మీడియా అకౌంట్ పాస్ వార్డ్ లీక్ కావచ్చు. ఈ క్రమంలో మన అకౌంట్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ కోడ్ సెట్ చేయండి. ఇలా చేస్తే.. మీ అకౌంట్ పాస్ వార్డ్ ఎవరికైనా తెలిసినా… మీ ఫోన్ కి OTP వస్తుంది. OTP లేకుండా అకౌంట్ ఓపెన్ కాదు.

అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయకండి: సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో కనిపించే అనుమానాస్పద, తెలియని లింక్స్ మీద క్లిక్ చేయకండి. దీని వలన మీ సమాచారం మిస్ యూజ్ కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఖాతాలో అమౌంట్ ఖాళీ అవుతుంది.

వెరిఫికేషన్ చేయకుండా డబ్బులు చెల్లించకండి: ఫ్రెండ్స్, రెలెటివ్స్ నుండి డబ్బులు కావాలంటూ సోషల్ మీడియాలో మెసేజ్లు కనిపిస్తే వెంటనే UPI ద్వారా చెల్లించకండి. వారికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి.

ఆశ-భయం: సైబర్ మోసగాళ్లు మన బలహీనతలను వాడుకుని మోసాలకు పాల్పడతారు. లాటరీలు, లోన్లు, హై పేయిడ్ జాబ్స్ ఈ కోవకు వస్తాయి. ఆశకు పోయి వారు అడిగిన సమాచారం ఇవ్వడం లేదా డబ్బులు చెల్లించడం చేయకండి. అలాగే డిజిటల్ అరెస్ట్ లు అంటూ భయపెట్టి మోసగాళ్లు లూటీ చేస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు ప్రపంచంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటారు. కేసులు పెట్టినా వారిని పట్టుకోవడం, డబ్బులు రికవరీ చేయడం, శిక్షలు వేయడం చాలా కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఉండటమే పరిష్కారం.

Leave a Comment