రైతుబంధు పథకం (రైతు భరోసా) విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మార్పులను తీసుకొస్తోంది. పథకం పేరు మార్పుతో పాటు పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు రేవంత్ రెడ్డి ఇప్పటికే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పైగా ఈ ఏడాది మొత్తం బడ్జెట్ లో ఒక్క వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించడం జరిగింది. కాబట్టి, తెలంగాణలో రైతుబంధు పక్కగా అమలు కాబోతుంది. ఐతే, కేసీఆర్ ప్రభుత్వంలో కోటీశ్వరులకు కూడా రైతుబంధు పథకం వర్తించింది. అసలు, సాగు చేయని వారికే కాదు, సాగు చేయడానికి పనికిరాని కొండలు, గుట్టల పేరిట కూడా రైతుబంధు పథకం ప్రయోజాలను పొందారు కొందరు. కానీ, ఇప్పుడు నిజమైన అర్హులకు మాత్రమే, మరీ ముఖ్యంగా సన్నకారు రైతులకు మాత్రమే రైతుబంధు ఇవ్వబోతున్నారు. అన్నట్టు ఇప్పుడు ఈ పథకం పేరు రైతుబంధు కాదు, ‘రైతు భరోసా’. మరి ఈ పథకం పూర్తి వివరాలతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మార్పులు చేర్పులు గురించి, అలాగే మీరు ఈ పథకం వల్ల డబ్బులను పొందాలంటే ఏం చేయాలో చూద్దాం రండి.
రైతుబంధు పథకం (రైతు భరోసా)లో కొత్త మార్పులు :
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరాకు రూ.15,000 ఇవ్వబోతుంది. అలాగే, కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం చేయబోతున్నారు. రైతుబంధు పథకం విషయంలో జరిగిన అక్రమాలను, రైతు భరోసా పథకంలో జరగకుండా అన్ని నిబంధనలను మార్చారు. నిజమైన కౌలు రైతులకు మాత్రమే ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం అందించనున్నారు.
రైతు భరోసా సాయంలోనూ అక్రమాలేనా ?
భూమి ఉన్నోళ్లకు రైతుబంధు పథకం (రైతు భరోసా పథకం) కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వడానికి రికార్డ్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మరి కౌలు రైతులకు సంబంధించి ఎలాంటి డేటా లేదు. కౌలు రైతులు ప్రతి ఏడాది భూమి మార్చే అవకాశం ఉంది. వారికీ అవకాశం ఉన్న భూమిలో మాత్రమే వారు వ్యవసాయం చేస్తుంటారు. కాబట్టి, వారి డేటా ప్రతి ఏడాది మారుతూ ఉంటుంది. ఈ లెక్కన కౌలు రైతులను గుర్తించడం ఎలా ?, కౌలు రైతుల పేరుతో కొందరు నకిలీ చేస్తే అప్పుడైనా అక్రమాలు జరుగుతాయి కదా ?, ఇలాంటి విషయాల్లోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కానీ, ఎన్ని కసరత్తులు చేసినా, ఎంత నిజాయితీగా ఉన్న గ్రౌండ్ లెవల్ లో వేరే ఉంటుంది. లోకల్ నాయకులు తమ అనుచరులకు కౌలు రైతుల పేరిట డబ్బు పంచిపెట్టడానికి ఇప్పటికే అన్ని విధాలుగా ఎదురుచుస్తున్నారు. ఈ క్రమంలో అర్హత ఉన్నవారికీ రైతు భరోసా సాయం అందకుండా పోయే అవకాశం ఉంది.
రైతుబంధు పథకం (రైతు భరోసా)లో ‘రైతు బీమా’
అసలు రైతుబంధు పథకం (రైతు భరోసా) లక్ష్యం.. రైతులకు పెట్టుబడి సాయం అందించి వారికి అండగా నిలబడటం. రైతుకు సాయం అందించడం కచ్చితంగా ప్రశంసించ దగిన విషయం. ఇందులో భాగంగానే కౌలు రైతుల కోసం రైతు బీమా పథకం తీస్తున్నారు. కౌలు రైతులకు ఈ రైతు బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది. రైతు బీమా పథకానికి అనుగుణంగా మార్గదర్శకాలను రూపొందించారు.
ఎలాగూ ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన కార్యక్రమం జరుగుతుంది. ఈ భీమా యోజన ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని కూడా పటిష్టంగా అమలు చేయడానికి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. కాకపోతే, రేవంత్ కి వ్యవసాయ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఎంతవరకు సహకరిస్తారు అనేదాన్ని బట్టి రైతు బీమా పథకం భవిష్యత్తు ఉండబోతుంది.
‘రైతు బీమా’ వల్ల రైతులకు మరో లాభం
ఒకవేళ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తే.. తెలంగాణ రైతులకు గొప్ప మేలు జరగనుంది. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో నకిలీ విత్తనాల సమస్య చాలా తీవ్రంగా ఉన్న మాట వాస్తవం. గత నెలలో మంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా నకిలీ విత్తనాల సరఫరా పై జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పారు. పైగా ‘రైతు బీమా’ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించబోతున్నాం అని భట్టి విక్రమార్క చెప్పారు. కాబట్టి, రైతుబంధు పథకం (రైతు భరోసా) వల్ల ‘రైతు బీమా’ కూడా రైతులకు అందబోతుంది.
ఈ రైతుబంధు పథకం (రైతు భరోసా)కి ఎవరు అర్హులు ?
ఈ పథకానికి ఉండాల్సిన అర్హత ప్రమాణాలు ఇవే
రైతు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
ఈ పథకానికి అర్హత పొందేందుకు ప్రతి రైతుకి వయస్సు పరిధి ఉంది. అది 18 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
తెలంగాణలో బ్యాంక్ ఖాతా ఉండాలి. రైతు తన పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాకి తన ఆధార్ కార్డుతో కనెక్ట్ చేసుకుని ఉండాలి .
ఈ రైతుబంధు పథకం (రైతు భరోసా) కోసం ఎలా నమోదు చేసుకోవాలి.
మీ ఆధార్ కార్డుతో పాటు మీ బ్యాంకు ఖాతా వివరాలను అలాగే భూమి మీదే అని నిర్ధారించే యాజమాన్య పత్రాలతో సహా అవసరమైన మిగిలిన పత్రాలను సమర్పించి.. రైతుబంధు పథకానికి నమోదు చేసుకోవచ్చు.
కౌలు రైతులు కూడా ఈ పథకానికి పై విధంగానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే, వారు సాగు చేస్తున్న భూమికి సంబంధించిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది.
మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా రైతుబంధు పథకం అదేనండి రైతు భరోసా పథకం రైతులకు మాత్రమే ఉపయోగపడాలని.. అలాగే, కౌలు రైతులకు కూడా ఎంతో మేలు జరగాలని కోరుకుందాం. కనీసం, ఇప్పటికైనా పెట్టుబడిదారులు, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ రైతు భరోసా పథకం డబ్బులు కోసం కక్కుర్తి పడకుండా ఉంటారని ఆశిద్దాం. ఏది ఏమైనా మన దేశంలో రైతే రాజు అంటారు, కానీ, నేటి మన రాజులెవ్వరూ రైతులు మాత్రం కాదు కదా . ఎంత విచిత్రం.
రైతుబంధు పథకం (రైతు భరోసా) పై పలు ప్రశ్నలు – సమాధానాలు :
రైతు బంధు స్టేటస్ ని ఎలా చెక్ చేయగలం ?
అందుకు ఒక ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ఉంది. ఆ సైట్ లింక్ ఇది. https://rythubandhu.telangana.gov.in/. మీరు ఈ వెబ్ సైట్ ని సందర్శించండి. సైట్ లోకి వెళ్ళాక హోమ్ స్క్రీన్‌పై చెక్ డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ రిపోర్ట్ బటన్ పై క్లిక్ చేయగలరు. క్లిక్ చేయగానే ఓపెన్ అయ్యే పేజీలో మీ జిల్లా, మీ మండలం ఎంచుకోండి. ఆ తర్వాత, మీ అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేసి.. మీ రైతు బంధు స్టేటస్ ని చెక్ చేసుకోండి.
రైతు బంధు డబ్బులు ఎలా తీసుకోవచ్చు ?
రైతులకు బ్యాంకు ద్వారా డబ్బులను చెక్ రూపంలో అందజేయడం జరుగుతుంది. రైతు బంధు చెక్కుల పంపిణీని వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) గ్రామ స్థాయిలో పర్యవేక్షించి.. అర్హులైన రైతులకు డబ్బు అందేలా చర్యలు తీసుకుంటారు. కానీ వీరు సరిగ్గా పని చేయడం లేదు అని ఎన్నో విమర్శలు ఉన్నాయి.
ఎన్ని ఎకరాలు ఉన్న వారికీ రైతు బంధు ఇస్తారు ?
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో ప్రస్తుతం 5 ఎకరాలు ఉన్న రైతులకు ఈ రైతు బంధు పథకం వర్తించేలా నిబంధనలు పెట్టారు.