పిల్లలు : మారుతున్న ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏమిటో తెలుసా ?, మీ పిల్లల్ని సరైన దారిలో పెంచడమే. ఒక కుటుంబం భవిష్యత్తు మొత్తం ఆధారపడేది.. ఆ కుటుంబంలోని పిల్లల మీదే. మీరు పెద్దగా ఆస్తులు సంపాదించకపోయినా నష్టమేమీ లేదు కానీ, మీ పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే మాత్రం.. మీకే కాదు, ఈ సమాజానికి కూడా నష్టమే. మీకు తెలుసా ?, ఇండియాలో చిన్న చిన్న పిల్లల్లో నేర ప్రవృత్తి రోజురోజుకూ పెరుగుతుందట. పైగా ఉన్నత, మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లలులోనే ఎక్కువ పెరుగుతుందట, ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ మధ్య హైదరాబాద్ నడిబొడ్డున ఓ ప్రముఖ స్కూల్ లో పిల్లలు మాదకద్రవ్యాలు తీసుకుంటూ పేపర్లకెక్కారు. ఇంకా వినడానికే బాధగా అనిపించే సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రశాంతంగా అమ్మ ఒడిలో ఆడుకుంటూ, ముద్దు ముద్దు మాటలు చెప్తూ పెరగాల్సిన పిల్లలు.. ముద్దాయిలుగా మారే పరిస్థితికి కారణం ఎవరు ?,
పిల్లలు ఎందుకు ఇలా మారుతున్నారు ?
పిల్లల్లో మార్పుకు కారణం ఎవరు ?, ఈ ప్రశ్నకి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. నిజానికి సమాధానం మాత్రం తల్లిదండ్రులే. అలా అని తల్లిదండ్రులది మాత్రమే తప్పు అని చెప్పలేం. మారుతున్న టెక్నాలజీ, ఆలోచన విధానం కూడా ఓ కారణమే. సరే.. వీటి మధ్యలో పిల్లలను సరిగ్గా పెంచడం ఎలా ?, అసలు పెంచడం కూడా చేతకాని తల్లిదండ్రులకి వారిని కనే హక్కు ఎక్కడిది ?, ఈ మాట అసహజమైనదే. కానీ, కొందరి తల్లిదండ్రుల పెంపకం అలాగే ఉంది మరి. వారిలో మార్పు ఆశించలేం కూడా. ఇంట్లో పెద్దవారైనా అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు తమ పిల్లల్ని పంపడానికే సదరు తల్లిదండ్రులు ఇష్టపడరు. వారికీ, తమ పిల్లలు ఆ వృద్దులు వంట తినడం నచ్చదు. బయట నిల్వ ఉన్న చెత్తే వారికి నచ్చుతుంది.
అందుకే, అమ్మమ్మ తాతయ్యల పట్ల, ప్రేమ, అభిమానం నేటి తరానికి పెద్దగా పట్టవు. అందుకు కారణం ఎవరు ?, వారి తల్లిదండ్రులు కారా ?, భార్య వైపు నుంచి అమ్మమ్మ తాతయ్యలు అంటే భర్తకు నచ్చదు. భర్త వైపు నుంచి అమ్మమ్మ తాతయ్యలు అంటే భార్యకు నచ్చదు. దీంతో.. అసలు అమ్మమ్మ తాతయ్యలతో పిల్లలకు గ్యాప్ వచ్చేస్తోంది. మొత్తంగా నేటి తరంలో కొందరి పిల్లల్లో క్రమశిక్షణ గానీ, గుడ్ బిహేవియర్ కానీ ఉండడం లేదు. అయినా, ఏమీ పట్టనట్లుగా వదిలేసే పేరెంట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అయినా, చిన్నప్పటి నుండి చాలా క్రమశిక్షణగా పెంచినా.. పిల్లలు ఏ తప్పు చేయరా ?, అది వారి స్వభావానికి సంబదించింది కదా. నిజమే, స్వభావం కారణంగా చేసే తప్పులు కేవలం వారికి మాత్రమే నష్టం కలిగించేవిగా ఉంటాయి, కానీ.. ఇతరులకు ఎలాంటి హాని చేయవు. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవు. అదే చెడు మార్గంలో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక చేసే తప్పులు సమాజానికి కూడా హాని కలిగిస్తాయి.
పిల్లలు పట్ల ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
- మీ పిల్లలను ఏ మహాత్మాగాంధీ లానో, మదర్ థెరిస్సా లానో పెంచక్కర్లేదు. కానీ, ఎవరికీ హాని కలిగించని విధంగా పెంచితే అదే గొప్ప. రేపటి పెద్ద పెద్ద నేరాలు నేటి చిన్న చిన్న తప్పుల నుండే మొదలవుతుంది అంటారు. ఈ రోజు మీ పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులను పెద్దవిగానే చూడండి. వారిని సరైన దారిలో పెట్టండి.
- తల్లిదండ్రులు తమ పిల్లల పనులు గమనించాలి. వారి తప్పులను సరిచేయకపోతే, వారికి తప్పులు చేయడం ఒక అలవాటుగా మారుతుంది. ఆ అలవాట్లే వారి నైజం కాకుండా తల్లిదండ్రులే జాగ్రత్త పడాలి.
- మీకు తెలుసా ?, పిల్లల్లో నేర ప్రవృత్తికి పూర్తిగా వారే ఎప్పుడు బాధ్యులు కారు. వారి చుట్టూ ఉండే పరిసరాలే సగం కారణం. కాబట్టి, మీ పిల్లలు బాగుండాలి అంటే.. వారు మంచి వ్యక్తులతో మంచి పరిసరాల్లో ఉండేలా చూసుకోండి.
- కొందరు పిల్లలు పెరిగే కొద్దీ చెడ్డవారుగా మారతారట. అందుకు కారణం వారి తల్లితండ్రులే. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇంట్లో తరచూ గొడవ పడతారో.. ఆ ఇంట్లోని పిల్లల్లో సున్నితత్వం పోతుంది. మూర్ఖులుగా ఆ పిల్లలు తయారవుతారు.
- కొందరు తల్లిదండ్రులు ఎప్పుడూ బిజీగా ఉంటారు. గుర్తు పెట్టుకోండి. మీ పిల్లలతో మీరు ఎక్కువ సమయం గడపకపోవడం వల్ల మీ పిల్లల్లో ఆత్మనూన్యతా భావం ఎక్కువ ఉంటుంది. దాని వల్ల వారు జీవితంలో రాణించలేరు.
పిల్లల పై ఎక్కువ ప్రభావం చూపేవి ఇవే :
- టీవీ లేని ఇల్లు లేదు. పైగా ఇప్పుడు ప్రతి పిల్లాడికి ఫోనో ట్యాబో ఇవ్వడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ, ఇది ఏ మాత్రం మంచిది కాదు. టీవీలలో వచ్చే హింసాత్మకమైన దృశ్యాలు చూసిన పిల్లల్లో హింసాత్మకమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయట.
- అలాగే, సామాజిక మాధ్యమాల్లో అనుకోకుండా కొన్ని సార్లు అసభ్యమైన చిత్రాలు, పాటలు వస్తుంటాయి. ఆ వీడియోలు చూసిన పిల్లలు కచ్చితంగా వాటి ప్రభావానికి గురి అవుతారు. వారి చదువు పూర్తిగా దెబ్బ తినే పరిస్థితి వస్తోంది. కాబట్టి, తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించండి.
- కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు అడగకుండానే అన్నీ తెచ్చి ఇస్తారు. ఇది మీ పిల్లలకు సంతోషాన్ని ఇవ్వొచ్చు. కానీ, వారికీ ఇది కీడే చేస్తోంది. అతి గారాబం ఏ మాత్రం మంచిది కాదు. అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం వల్ల, ఉన్న దాని విలువ వారికి ఎప్పటికీ తెలియదు.
పిల్లలు పై కఠినత్వం వద్దు :
- కొందరు తల్లిదండ్రులు ఉంటారు. తమ పిల్లలను మరీ క్రమశిక్షణగా పెంచుతారు. నిజానికి అది క్రమశిక్షణ కాదు, కఠినత్వం. పిల్లలన్నాక ఖచ్చితంగా తప్పులు చేస్తారు చేయాలి కూడా. ఆ తప్పుల గురించి వారికీ చెప్పాలి. వారిని సరిదిద్దడానికి ఒక్కోసారి కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చినా.. తప్పుల పై కఠినత్వం ఉండాలి గానీ, మీ పిల్లల పై కాదు.
- తల్లిదండ్రులు క్రమశిక్షణకు బదులు కఠినత్వంతో ఉంటే.. పిల్లలు తమ తల్లిదండ్రుల మీద అసహ్యం పెంచుకుంటారు. పైగా తల్లిదండ్రులు లేని సమయంలో ఇంకా రెచ్చిపోయి తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే, తల్లిదండ్రులు ఎప్పుడూ మీ పిల్లల పట్ల కఠినత్వంతో ఉండొద్దు.
- మీ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి. వారు ఏమి చేస్తున్నారో ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించి.. వారిని సరైన మార్గంలో పెట్టండి. తెలిసి తెలియక చేసిన వారి తప్పులను క్షమించండి. మళ్ళీ వారు ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తలు చెప్పండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అది వారికీ మీకు అందరికీ మంచిది.