ఎన్నెన్నో జన్మల బంధం ఉంటేనే గానీ, మీ జీవితంలోకి ఓ మనిషి రారు అంటారు. ఈ మాటలో నిజమెంత ఉందో గానీ, మానవ సంబంధాల గురించి ఒక మాట మాత్రం బాగా పాపులర్ అయ్యింది. రవ్వంత హాస్యం, చిటికెడు వ్యంగ్యం, గోరంత లోకరీతి, కాస్తంత అతిశయోక్తి ఇవన్నీ కలిపి వడ్డించేదే మానవ సంబంధాలు. అయితే, మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే అని బలంగా వాదించే వారూ ఉన్నారు. మనుషులు అంతా ఆర్థిక సంబంధాల కారణంగా.. గాలానికి చిక్కిన చేపల వాలే మరణిస్తారు అంటూ కొందరు సూక్తులు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఒక్కటి ఆలోచించండి. మానవ సంబంధాలన్ని స్వార్థ పూరితం అయితే, ఇక అందరూ దాన్నే నమ్మితే.. ‘ఏ మనిషి ఇంకొకరితో కలిసి బ్రతకలేడు. స్నేహం చేయడు. ఎవరిని ప్రేమించడు.. అసలు మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయడేమో. అప్పుడు మనుషులు ఎలా ఉంటారో అని ఆలోచించడానికే భయం వేస్తోంది.
కాబట్టి, నేటి మానవ సంబంధాల ఎన్నెన్నో జన్మల బంధం అనుకోవడమే మనిషికి మేలు చేస్తోంది. కాకపోతే, మానవ సంబంధాల్లో తరుచూ జరిగే పొరపాటు ఏమిటో తెలుసా ?, ఎదుటివారు చెప్పేది సగం సగం వినడం, మళ్లీ అందులో సగం అర్థం చేసుకోవడం, దీనికితోడు అసలేమీ ఆలోచించకుండా ఎదుటి వ్యక్తి వ్యతిరేకించిన మాటలకు పదిరెట్లు అతిగా ప్రతి స్పందించడం.. ప్రస్తుతం మానవ సంబంధాలు ఇలాగే ఉన్నాయి. సంబంధాలు ఎప్పుడు మామూలుగా వాటి అంతటా అవే చావవు. అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకార పూరిత వైఖరి వలన మాత్రమే చనిపోతాయి. అందుకే, మానవ సంబంధాలు నిలబడాలి అంటే.. బంధాల పై నిర్లక్ష్యం తగదు.
అయినా, మనిషి పోయాక ప్రేమాభిమానాలు పంచితే ఏం లాభం ?, ఆ మనిషి జీవించి ఉన్నప్పుడే నేనున్నాను అని భరోసా ఇస్తేనే కదా బంధానికి అర్ధం. కాబట్టే.. మానవ సంబంధాలన్ని బ్యాంకు అకౌంట్ లాంటివి. ఎంత తక్కువ డిపాజిట్ చేస్తే అంత తక్కువ రిటర్న్స్ ఉంటాయి. అదేవిధంగా ఎంత ఎక్కువ డిపాజిట్ చేస్తే అంత ఎక్కువగా మనం తిరిగి విత్ డ్రా చేసుకోవచ్చు. పైగా వడ్డీ రూపంలో మంచి భరోసా కూడా ఉంటుంది. మన అనే ఆ భరోసా మీకు కొండంత అండగా నిలబడుతుంది. అలా నిలబడ్డ సంబంధమే ఎన్నెన్నో జన్మల బంధం అవుతుంది.
ఎన్నెన్నో జన్మల బంధం కూడా ఆ కారణం వల్ల :
మీకు తెలుసా ?, చాలా సంబంధాలు ముగిసిన పోవడానికి ముఖ్య కారణం.. వారి మధ్య విపరీతమైన అభిప్రాయ బేధాలు రావడం కాదు. ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడలేకపోవడం, మిగిలిన మరొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. కేవలం, ఈ రెండు కారణాల వల్లే.. ఎంతో గొప్ప అనుబంధాలు అయినా.. మధ్యలోనే అపార్ధాల సముద్రంలో మునిగిపోతున్నాయి. పైగా ఎప్పుడో 135 ఏళ్ల క్రితమే కార్ల్ మార్క్స్ చెప్పాడు అంటూ ఈ సూక్తి చెబుతారు. మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే. అందుకే ఆయన మంచి ఆర్థిక వేత్త అయ్యాడు అనుకుంటా మనోళ్లు మనసులోనే ఓ నిర్దారణకు వచ్చేస్తారు. నిజానికి కార్ల్ మార్క్స్ తన వాల్లందరితో మంచి రిలేషన్ ను మెయింటైన్ చేశారు. అన్నట్టు కార్ల్ మార్క్స్ తన జీవితాన్నే కుటుంబానికే ధారపోశాడు. మీరు కార్ల్ మార్క్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన బుక్స్ చదివితే.. అందులో మానవ సంబంధాలు ఎన్నెన్నో జన్మల బంధం అనేలా అతని జీవితం సాగింది అని అర్ధం చేసుకుంటారు.
కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. మన దేశంలో సగానికంటే ఎక్కువ సంబంధాలు కేవలం అప్పు వల్లే నాశనం అవుతున్నాయి. మీరు విన్నది నిజమే.. కేవలం మీరు ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వమని అడగడం వల్లే.. సగం మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. కానీ, వ్యక్తిగత – వృత్తిపరమైన రంగాల్లో మానవ సంబంధాలు అనేవి ఎంతో కీలకం.జీవితంలోని సవాళ్లను పేస్ చేసే సమయంలో మన చుట్టూ ఉన్న మనుషుల మోరల్ సపోర్ట్ మనకు ఆక్సిజన్ లాంటిది. మీ ఒంటరితనం, మీ మానసిక ఆందోళన మరియు మీ నిరాశను తగ్గించే ఏకైక మెడిసిన్. మానవ సంబంధాలే. ఆ సంబంధాలను మీరు ఎన్నెన్నో జన్మల బంధం అనుకుంటారో. లేక, జస్ట్ టైమ్ పాస్ అనుకుంటారో మీ ఇష్టం. కానీ, ఆ బంధాలను నిలబెట్టుకోవడం మీ ఎదుగుదలకు అత్యంత కీలకం అని గుర్తు పెట్టుకోండి చాలు.
మీ బంధాన్ని నిలబెట్టుకోవాలంటే ?
- ఒక్కటే మార్గం. ఆరోగ్యకరమైన సంబంధాలను మెయింటైన్ చేయడానికి కమ్యూనికేషన్, నిబద్ధత, నిజాయితీ చాలా అవసరం. మీ సంబంధాలు బాగుండాలి అంటే ఈ టిప్స్ పాటించండి.
- గుడ్ కమ్యూనికేషన్: ఏ సంబంధంలోనైనా సరే కమ్యూనికేషన్ చాలా కీలకం. చెప్పేది స్పష్టంగా వినండి, అలాగే, మీ ఆలోచనలను మీ భావాలను అంతే స్పష్టంగా చెప్పండి.
- గుడ్ టైమ్ : మీ జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులతో మీరు ఎక్కువ సమయాన్ని గడపాలి. వారితో కలిసి ట్రిప్స్ ప్లాన్ చేయండి, మీ అనుభవాలను వారితో సంతోషంగా పంచుకోండి. వారితో కలిసి జ్ఞాపకాలను పెంచుకోండి.
- ప్రశంసలు ముఖ్యం : మీకు మేలు చేసిన వ్యక్తులను మర్చిపోవద్దు. వారి పట్ల కృతజ్ఞతతో ఉండండి. అవకాశం ఉంటే వారి పై ప్రశంసలు కురిపించండి. మీ కోసం వారి ప్రయత్నాలను గుర్తించి థ్యాంక్స్ చెప్పండి.
- ప్రేమలోనూ సరిహద్దులు ఉంటాయి : మీరు ప్రేమించే వారిని గౌరవించడం ఎంతో అవసరం. అలాగే, మీ ప్రేమకు సరిహద్దులు ఉండాలి. ప్రతి వ్యక్తికీ ప్రాధాన్యతలు ఉంటాయి. వారి వ్యక్తిత్వాన్ని గౌరవించి.. వారిని అర్థం చేసుకోండి. వారి వ్యక్తిగత విషయాల పై విమర్శలు చేయకండి.
- అభిప్రాయ బేధాలు : ఎంత గొప్ప సంబంధంలోనైనా సరే కచ్చితంగా అభిప్రాయ బేధాలు వస్తాయి. అది సహజం కూడా. ఐతే, మీ అభిప్రాయ బేధాల విషయంలో ప్రశాంతంగా ఆలోచించండి. అవతలి వ్యక్తి దృక్పథాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరస్పరం ప్రయోజనకరమైన పరిష్కారం కోసం వారితో కలిసి పని చేయండి.
- ట్రస్ట్ ముఖ్యం : బలమైన సంబంధానికి నమ్మకం పునాది అనేది మీకు తెలుసు. నమ్మకంగా ఉండండి, మీరు వాగ్దానం చేస్తే దాన్ని నిలబెట్టుకోండి. నిజాయితీగా ఉండటం ద్వారే నమ్మకం పెరుగుతుంది.
- పాజిటివిటీ : ఏ సంబంధాలలో అయినా పాజిటివిటీ పైనే దృష్టి పెట్టాలి. పాజిటివిటీ వాతావరణాన్ని సృష్టించుకోవాలి.